•మాజీ మంత్రుల మౌనముద్ర
•పిలిచి హెచ్చరిస్తున్న అధినేత జగన్
•తప్పుకుంటే కొత్తవారికి అవకాశం కల్పిస్తానని తేల్చి చెబుతున్న వైనం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:- వైసీపీ మాజీ మంత్రులపై జగన్ సీరియస్ అయ్యారా? వారు మౌనం పాటించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారా? యాక్టివ్ కాకుంటే కొత్త నేతలను రంగంలోకి దించుతానని హెచ్చరించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించిన వారు వ్యూహాత్మకంగా సైలెన్స్ పాటిస్తున్నారు. కొందరు పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. సొంత పనుల్లో నిమగ్నమయ్యారు. అటువంటి వారిని పిలిచి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. పార్టీలో యాక్టివ్ కాకుంటే మార్చేస్తానని హెచ్చరిస్తున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు..
గతంలో అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలపై ఓ రేంజ్ లో విరుచుకు పడేవారు కొందరు నేతలు. అటువంటి వారికి పిలిచి మరీ పదవులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే పవర్ పోయేసరికి అటువంటి నేతలు అంతా సైలెన్స్ లోకి వెళ్లారు. గతంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిన నేతలంతా ఎందుకో మౌనం దాల్చుతున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఉషశ్రీ చరణ్ మౌనంగా ఉన్నారు. కారుమూరు నాగేశ్వరరావు గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తానేటి వనిత తదితరులు కూటమిపై కనీసం స్పందించడం లేదు. ఇందులో కొందరైతే నియోజకవర్గాల ముఖం కూడా చూడడం లేదు. దీంతో ఈ మాజీలపై జగన్ సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
పార్టీ కార్యక్రమాలకు దూరంగా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి రెండేళ్లు అవుతోంది. కనీసం చాలామంది నేతలు యాక్టివ్ కావడం లేదు. నియోజకవర్గాల ముఖం చూడడం లేదు. పార్టీ కార్యక్రమాలు చురుగ్గా చేపట్టడం లేదు. ఇప్పుడు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతున్న పట్టించుకోవడం లేదు. వైసీపీలో ఒక వెలుగు వెలిగి అనేక రకాల కారణాలు చూపుతూ సైలెన్స్ పాటిస్తున్న నేతలను ఇప్పుడు జగన్ వరుసగా పిలుస్తున్నారు. ఎందుకు క్రియాశీలకం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇష్టం లేకపోతే తప్పుకోండి.. కొత్తవారికి అవకాశం కల్పిస్తానని హెచ్చరిస్తున్నారు. దీంతో నేతలు అటువంటిదేమీ లేదని.. యాక్టివ్ అవుతామని చెబుతున్నారు.
గట్టి వార్నింగ్..
ప్రస్తుతం కూటమి దూకుడు మీద ఉంది. మూడు పార్టీలు చక్కటి సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గాల్లో వైసీపీ దూకుడు పెంచకపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి నేతలను పిలిచి మరి వార్నింగ్ ఇస్తున్నారు. యాక్టివ్ కావాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. కొందరు నేతలు వ్యాపారాల్లో నిమగ్నమై పార్టీని పట్టించుకోని విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. అటువంటివారు గౌరవంగా తప్పుకుంటే కొత్త వారికి అవకాశం ఇస్తానని చెబుతున్నారు. దీంతో వైసిపి నేతల్లో ఒక రకమైన టెన్షన్ కనిపిస్తోంది.