Homeక్రీడలుIPL Eliminator: వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్.. టోర్నీకి హైదరాబాద్ గుడ్‌ బై

IPL Eliminator: వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్.. టోర్నీకి హైదరాబాద్ గుడ్‌ బై

ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌ లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిరాశపరిచింది. బ్యాటర్లు, బౌలర్లు ఇద్దరూ విఫలం కావడంతో జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. రెండో టైటిల్ ఆశలు నాకౌట్ దశలోనే ముగిశాయి. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో భారీ విజయాన్ని నమోదు చేసి క్వాలిఫయర్-2కు చేరుకుంది.

చెలరేగిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ

మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ చేసింది. యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సన్‌ రైజర్స్ బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. 97 పరుగుల దగ్గర అవుటై శతకం చేజార్చుకున్నా, తన దూకుడు ఆటతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా కూడా నిలిచాడు. గతంలో క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 65 సిక్సర్లు ఉన్నాయి. వైభవ్‌కు తోడుగా ధృవ్ జురెల్  కూడా అర్ధశతకంతో రాణించాడు. దీంతో రాజస్థాన్ 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. చివరి ఓవర్లలో సన్‌రైజర్స్ బౌలర్లు కొంత నియంత్రణ చూపించినా అప్పటికే ఆలస్యమైంది.

మొదట్లోనే కీలక ఆటగాళ్లు ఔట్

244 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌ రైజర్స్‌ కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆర్చర్ అద్భుత బౌలింగ్‌ తో హైదరాబాద్ బ్యాటింగ్‌ ను కుదేలు చేశాడు. ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ వంటి కీలక ఆటగాళ్లు త్వరగా ఔటయ్యారు. మధ్యలో క్లాసెన్, నితిష్ కుమార్ రెడ్డి కొంత పోరాడినా మ్యాచ్‌ ను కాపాడలేకపోయారు. క్లాసెన్ వికెట్ పడిన తర్వాత సన్‌ రైజర్స్ పూర్తిగా ఒత్తిడిలో పడింది. చివర్లో కొన్ని షాట్లు వచ్చినా జట్టు లక్ష్యానికి చాలా దూరంలో ఆగిపోయింది.  47 పరుగుల తేడాతో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మే 29న జరిగే క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు