HomeజాతీయంHamza Burhan Shot Dead: గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు, పుల్వామా దాడి సూత్రధారి హమ్జా...

Hamza Burhan Shot Dead: గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు, పుల్వామా దాడి సూత్రధారి హమ్జా బుర్హాన్ హతం!

2019లో దేశాన్ని కుదిపేసిన పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి కీలక పాత్ర పోషించాడని భావిస్తున్న హమ్జా బుర్హాన్‌ మృతి చెందినట్లు సమాచారం. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని ముజఫరాబాద్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో హమ్జా అక్కడికక్కడే మృతిచెందినట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి.

డాక్టర్ టెర్రరిస్ట్ హతం!

హమ్జా అసలు పేరు అర్జుమంద్ గుల్జార్ దార్. అతడు జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా రత్నిపొరా ప్రాంతానికి చెందినవాడు. ఉన్నత విద్య కోసం వెళ్తున్నానని చెప్పి 2017లో పాకిస్థాన్‌కు వెళ్లినట్లు సమాచారం. అక్కడికి వెళ్లిన తర్వాత పీవోకేలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్ బదర్‌ లో చేరాడు. కొంతకాలంలోనే ఆ సంస్థలో కీలక సభ్యుడిగా ఎదిగి కమాండర్ స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాద వర్గాల్లో అతడిని డాక్టర్  అనే పేరుతో కూడా పిలిచేవారని సమాచారం.

పుల్వామా దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం

2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. సీఆర్‌పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన ఆ దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా హమ్జా పాత్ర ఉన్నట్లు భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి.

హమ్జాపై కాల్పులు జరిపింది ఎవరు?

పుల్వామా దాడితో పాటు కశ్మీర్‌లో జరిగిన మరికొన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా అతడికి సంబంధాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. అయితే హమ్జాపై కాల్పులు జరిపింది ఎవరు? దాడి వెనుక కారణాలేమిటి? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవల పీవోకేలో ఉగ్రవాద సంస్థలకు చెందిన పలువురు కీలక వ్యక్తులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో, హమ్జా హత్య కూడా అదే తరహాలో జరిగి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు