HomeజాతీయంCBSE Evaluation: సీబీఎస్ఈ 12 ఫలితాలపై వివాదం.. OSM విధానంపై విద్యార్థుల ఆగ్రహం!

CBSE Evaluation: సీబీఎస్ఈ 12 ఫలితాలపై వివాదం.. OSM విధానంపై విద్యార్థుల ఆగ్రహం!

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల వాల్యుయేషన్ విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆన్ స్క్రీన్ మార్కింగ్  (OSM) విధానంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఆశించిన మార్కులు రాలేదని భావించిన చాలామంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, దరఖాస్తు ప్రక్రియలోనే పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.

మా చేతిరాత మేమే చదవలేకపోతున్నాం!

కొంతమంది విద్యార్థులు తమకు అందిన స్కాన్ చేసిన జవాబు పత్రాల స్క్రీన్‌ షాట్లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అవి స్పష్టంగా కనిపించకపోవడంతో, ఇలాంటి అస్పష్టమైన కాపీలను ఎలా వాల్యుయేషన్ చేశారని ప్రశ్నిస్తున్నారు. కొన్ని జవాబు పత్రాల్లో చేతిరాత పూర్తిగా బ్లర్‌ గా కనిపిస్తోందని, విద్యార్థులు తామే చదవలేని పరిస్థితి ఉందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. దీంతో వాల్యుయేషన్ ప్రక్రియలో పారదర్శకత ఉండాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి.

వివరణ ఇచ్చిన సీబీఎస్ఈ

ఇక మరోవైపు, స్కాన్ చేసిన జవాబు పత్రాలను పొందేందుకు ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ పోర్టల్ సజావుగా పని చేస్తోందని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. పోర్టల్ ప్రారంభమైన మూడు గంటల్లోనే 1.27 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపింది. మొత్తం 3.87 లక్షల స్కాన్ కాపీల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసినట్లు వెల్లడించింది.

ఓఎస్ఎం విధానంలో స్కానింగ్ లోపాలున్నాయన్న ఆరోపణలను బోర్డు తిరస్కరించింది. అధికారిక పోర్టల్ ద్వారానే విద్యార్థులు సేవలను వినియోగించుకోవాలని సూచించింది. అయినప్పటికీ, చాలామంది విద్యార్థులు చెల్లింపులు ఫెయిల్ అవుతున్నాయని, పోర్టల్‌ లో లాగిన్ కావడం కష్టమవుతోందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొందరు దరఖాస్తు పూర్తయినా రసీదు రావడం లేదని కూడా ఫిర్యాదు చేస్తున్నారు. ఈ వివాదంతో సీబీఎస్ఈ మూల్యాంకన విధానంపై మరోసారి చర్చ మొదలైంది. విద్యార్థుల భవిష్యత్తుతో సంబంధం ఉన్న అంశం కావడంతో సమస్యలను వెంటనే పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు