Crime Mirror, Cinema Updates: భారతీయ సినీ పరిశ్రమలో డ్యాన్స్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. ఈసారి ఆయన కొత్త సినిమా లేదా దర్శకత్వం వల్ల కాదు.. తన కుమారుడు రిషి రాఘవేందర్ దేవాతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో కారణంగా వార్తల్లో నిలిచారు. సముద్ర తీరంలో తండ్రీకొడుకులు కలిసి వేసిన స్టెప్పులు అభిమానులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రభుదేవా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియోను పంచుకున్నారు. బీచ్‌లో సరదాగా గడుపుతున్న సమయంలో, తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన కాదలన్ (తెలుగులో ప్రేమికుడు) చిత్రంలోని సూపర్ హిట్ పాట పెట్టా రాప్ కు ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. ఒకే రకమైన మూమెంట్స్, అద్భుతమైన సమన్వయం, ఎనర్జీతో చేసిన ఈ ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా రిషి రాఘవేందర్ దేవా డ్యాన్స్ స్టైల్‌ను చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రి తరహాలోనే గ్రేస్, రిథమ్, బాడీ లాంగ్వేజ్ కనిపించాయని కామెంట్లు చేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు, డ్యాన్స్ టాలెంట్ వారసత్వంగా వచ్చింది, భవిష్యత్తులో సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు అంటూ అభిమానులు స్పందిస్తున్నారు.
ప్రభుదేవా భారతీయ సినీ పరిశ్రమలో మూడు దశాబ్దాలకు పైగా విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కొరియోగ్రాఫర్‌గా ప్రారంభమైన ఆయన కెరీర్ తర్వాత హీరోగా, దర్శకుడిగా విస్తరించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పని చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. వినూత్న డ్యాన్స్ స్టైల్‌తో ఆయనకు ఇండియన్ మైకేల్ జాక్సన్ అనే పేరు కూడా వచ్చింది.
దర్శకుడిగా కూడా ప్రభుదేవా విజయవంతమైన చిత్రాలను అందించారు. తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్‌బస్టర్‌తో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకోగా, హిందీలో వాంటెడ్ , రౌడీ రాథోర్వం టి హిట్ సినిమాలను తెరకెక్కించారు.
ఇప్పుడు కుమారుడితో కలిసి చేసిన ఈ డ్యాన్స్ వీడియో అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. రిషి కూడా భవిష్యత్తులో సినీ రంగంలో అడుగుపెడతాడా అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుండగా, లక్షలాది మంది వీక్షిస్తూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తండ్రీకొడుకుల ఈ అందమైన కాంబినేషన్ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
