వరంగల్, క్రైమ్‌మిర్రర్: జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని నష్కల్ గ్రామం మద్యపాన రహిత గ్రామంగా మారాలని ఇటీవల తీర్మానం చేసుకుంది. అదే లక్ష్యంతో ఒక నిర్ణయాన్ని అమలు చేసింది. గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా మద్యం విక్రయిస్తున్న ఆరుగురి ఇళ్లకు అధికారులు విద్యుత్ కనెక్షన్లను పూర్తిగా తొలగించారు. మద్యం రహిత గ్రామం కోసం గతంలో గ్రామసభలో ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం మేరకే ఈ చర్యలు తీసుకున్నట్లు సర్పంచ్ శాతబోయిన రాజు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది.గ్రామ పెద్దలు తెలిపిన వివరాల ప్రకారం… చిల్పూర్ మండలంలోని నష్కల్ గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడవడం వల్ల స్థానిక యువత మద్యానికి ఆకర్షితులవుతున్నారు.
Also Read:గోల్డ్ మ్యాన్ గేమ్ ఓవర్… రూ.30 లక్షల మోసం చేసి పారిపోతుండగా షాద్‌నగర్‌లో అరెస్ట్!
దీనివల్ల వారు చెడు అలవాట్లకు బానిసలై భవిష్యత్తును పాడు చేసుకునే ప్రమాదం ఉందని చాలా మంది గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తును, కుటుంబాల బాగును దృష్టిలో ఉంచుకుని, గ్రామంలో మద్యపానాన్ని పూర్తిగా నియంత్రించాలని గతంలోనే గ్రామసభలో ప్రత్యేక తీర్మానం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా గ్రామంలో మద్యం విక్రయిస్తే వారి రేషన్ కార్డు, కరెంటుతో పాటు ఇతర ప్రభుత్వ సౌకర్యాలను కూడా నిలిపివేస్తామని సర్పంచ్ శాతబోయిన రాజు హెచ్చరించారు.గొప్ప చరిత్ర, ఆధ్యాత్మిక విలువలు ఉన్న నష్కల్ గ్రామాన్ని ఆదర్శవంతమైన మద్యపాన రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో సర్పంచ్ శాతబోయిన రాజు నేతృత్వంలో గ్రామ పెద్దలు ఈ కఠినమైన నిర్ణయానికి వచ్చారు.
Also Read:ఫుట్‌పాత్‌పై వాయిలిన్‌తో పోరాటం… 80 ఏళ్ల కళాకారుడి జీవితాన్ని మార్చబోతున్న ఆనంద్ మహీంద్ర!”
ఈ మేరకు ప్రజలందరితో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు తీర్మానించారు. కాగా, ప్రస్తుతం కరెంటు కనెక్షన్ కోల్పోయిన వ్యక్తులు, ఇకపై గ్రామంలో ఎలాంటి మద్యం అమ్మేది లేదని అధికారికంగా బాండు పేపర్ రాసి ఇస్తేనే.. వారి ఇళ్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని పంచాయతీ వర్గాలు స్పష్టం చేశాయి.
Also Read:రైల్లో చెత్త వేస్తూ 8 గంటలు హంగామా.. సహనం కోల్పోయిన ప్రయాణికుడు చెప్పిన షాకింగ్ స్టోరీ!