-
ఐపీఎల్ విస్తరణకు బీసీసీఐ కసరత్తు
-
గుజరాత్, మహారాష్ట్రకు రెండో జట్టుకు అవకాశం
-
ఏపీకి ఒక్క జట్టు కూడా లేని వైనం
-
తెలుగు రాష్ట్రాలకు ఒక్క హైదరాబాద్ సన్‌రైజర్స్ మాత్రమే అవకాశం
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ కొత్త ఫ్రాంచీల రేసులో విశాఖ లేకపోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను రాబోయే కాలంలో 10 జట్ల నుంచి 12 జట్లకు విస్తరించాలని బీసీసీఐ కసరత్తు చేస్తోంది. అయితే కొత్త ఫ్రాంచైజీల రేసులో పూణే, వడోదర వంటి నగరాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కానీ ఏపీ ఆర్థిక రాజధానిగా, తూర్పు తీరం ముఖద్వారంగా ఉన్న విశాఖ పేరును కనీస పరిశీలనలోనూ లేకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. గుజరాత్ ఇప్పటికే అహ్మదాబాద్ ఫ్రాంచైజీని కలిగి ఉండగా మళ్లీ వడోదరకు, మహారాష్ట్రలో ముంబై ఉండగా మళ్లీ పూణేకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచన చేయడమే విడ్డూరం. దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న కాస్మోపాలిటిన్ మహానగరం విశాఖ. అన్ని అర్హతలు కలిగి ఉన్నప్పటికీ ఐపీఎల్ ఫ్రాంచైజీల రేసులో విశాఖ నిలవకపోవడం గమనార్హం.
సత్తా కలిగిన నగరం…
ఆర్థికంగా, వ్యాపార పరంగా చూస్తే విశాఖ ఐపీఎల్ వంటి మెగా ఈవెంట్ ను విజయవంతంగా నడిపేందుకు అత్యున్నత స్థాయి సత్తా కలిగిన నగరం. తూర్పు తీరంలోనే పారిశ్రామిక, ఐటీ, ఫార్మా, పోర్టు ఆధారిత ఎకానమీతో వేలకోట్ల రూపాయల వార్షిక టర్నోవర్‌ను నమోదు చేస్తున్న మహానగరం ఇది. ప్రస్తుతం సాగర తీరాన జరుగుతున్న భారీ పెట్టుబడుల సదస్సులు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లతో నగరం అంతర్జాతీయ స్థాయి గుర్తింపును పొందుతోంది. ఇప్పటికే ఏపీలో బలమైన కార్పొరేట్ గ్రూపులు,, మల్టీ బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాలు ఉన్నాయి. ఐపీఎల్ జట్టు వేలంలో బిడ్ వేసేందుకు, స్పాన్సర్ షిప్ లు సమకూర్చేందుకు కావాల్సిన పారిశ్రామిక మద్దతు వైజాగ్ పుష్కలంగా ఉంది. ఒక బిలియన్ డాలర్లకు పైగా పలికే ఫ్రాంచైజీ మార్కెట్ కు అవసరమైన కొనుగోలు శక్తి విశాఖ కార్పొరేట్ రంగానికి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
గొప్ప ఆతిథ్య మైదానం…
విశాఖలోని ఏసీఏ- వీడిసిఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం దశాబ్దాలుగా అనేక చిరస్మరణీయమైన అంతర్జాతీయ మ్యాచులకు, ఐపీఎల్ హోం మ్యాచ్ లకు విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చింది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు రెండో హోం గ్రౌండ్ గా వ్యవహరించింది. అంతేకాకుండా అంతర్జాతీయ విమానాశ్రయం, భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వంటి రాకపోకల సదుపాయాలు, బీచ్ రోడ్డు వెంబడి విస్తరించిన స్టార్ హోటల్, పర్యాటక వసతులు అంతర్జాతీయ జట్లకు, విదేశీ ఆటగాళ్లకు, వీఐపీ అతిథులకు అత్యుత్తమ ఆతిథ్యం ఇవ్వగలవు. అన్నింటికీ మించి ఎలాంటి వివాదాలు లేని క్రీడా సంస్కృతి విశాఖ సొంతం.
ఎన్నో ప్రయోజనాలు…
అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకి సొంతంగా ఒక్క ఐపీఎల్ జట్టు కూడా లేకపోవడం క్రీడా పరంగా పెద్ద వెలితి. పొరుగున ఉన్న తెలంగాణకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉన్నప్పటికీ, ఐదు కోట్ల జనాభా కలిగిన ఏపీకి ప్రాతినిధ్యం వహించే ఒక ప్రత్యేక ఐపిఎల్ ఫ్రాంచైజీ ఉంటే ఆ మార్కెట్ సామర్థ్యం ఊహకందని స్థాయిలో ఉంటుంది. ఏపీ ప్రజల్లో క్రికెట్ పట్ల ఉన్న పిచ్చి, అభిమానం అపారమైనది. వైజాగ్ కేంద్రంగా జట్టు వస్తే ఏపీలోని విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి నగరాలను ఆ జట్టుకు మద్దతుగా మారుతాయి. ఇది బ్రాడ్కాస్టర్లకు, అడ్వర్టైజర్లకు అద్భుతమైన టిఆర్పి లను, వాణిజ్య ప్రయోజనాలను తెచ్చిపెడుతుంది. అందుకే గుజరాత్, మహారాష్ట్రలకే రెండు చొప్పున జట్లను కట్టబట్టే బదులు.. తూర్పు తీరానికి పెద్దదిక్కుగా ఉన్న విశాఖకు ప్రాధాన్యం ఇస్తే బాగుంటుంది అని అభిప్రాయం వినిపిస్తోంది.
