HomeజాతీయంPM Kisan Update: రైతుల ఖాతాల్లో మళ్లీ పీఎం కిసాన్ నగదు.. ఎప్పుడు వేస్తారంటే?

PM Kisan Update: రైతుల ఖాతాల్లో మళ్లీ పీఎం కిసాన్ నగదు.. ఎప్పుడు వేస్తారంటే?

దేశంలోని రైతులకు ఆర్థిక సహాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కింద మరో విడత నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం తేదీని ఖరారు చేసింది. 23వ విడత సాయాన్ని జూన్ 20న రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఈ నిధులను ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. దీంతో అర్హులైన రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున నేరుగా జమ కానుంది.

వ్యవసాయ ఖర్చులకు కొంత ఊరట  

కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి సాయంగా ప్రతి సంవత్సరం రూ.6,000 అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున రైతులు పొందుతున్నారు. 2019లో ప్రారంభమైన పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటివరకు కోట్లాది మంది రైతులు లబ్ధి పొందారు. రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ ఫర్ (డీబీటీ) విధానంలో నిధులు రైతుల ఖాతాలకు చేరుతున్నాయి.ఈ ఏడాది 22వ విడత నిధులను మార్చి 13న అసోంలోని గౌహతిలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ విడుదల చేశారు. ఇప్పుడు 23వ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రైతులు ఏం చేయాలంటే?

అయితే, రైతులు తమ ఈ-కేవైసీ, ఆధార్ లింకింగ్, బ్యాంకు ఖాతా వివరాలు సరిగా ఉన్నాయో? లేదో? ముందుగానే తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వివరాల్లో ఏవైనా సమస్యలు ఉంటే నిధుల జమలో ఆలస్యం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.  జూన్ 20న విడుదలయ్యే ఈ విడతతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు మరోసారి ఆర్థిక మద్దతు లభించనుంది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు