హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, ఇతర ఆహార వ్యాపార సంస్థలకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కీలక సూచనలు జారీ చేసింది. ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను మరింత మెరుగుపర్చేందుకు కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది.
తప్పుపట్టిన కత్తులు ఉపయోగించకూడదు!
తాజా మార్గదర్శకాల ప్రకారం వంటగదుల్లో తుప్పుపట్టిన, విరిగిన, పాడైన, రంగు వేసిన కత్తులను ఉపయోగించకూడదు. అలాగే కటింగ్ బోర్డులు, వంట పరికరాలు, ఆహారం తయారీలో ఉపయోగించే ఇతర సామగ్రి కూడా పరిశుభ్రంగా, మంచి స్థితిలో ఉండాలని స్పష్టం చేసింది. దెబ్బతిన్న, తుప్పు పట్టిన పరికరాలను ఉపయోగించడం వల్ల ఆహారంలో హానికరమైన లోహ కణాలు, ఇతర కలుషిత పదార్థాలు కలిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది వినియోగదారుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
తనిఖీల్లో ఆందోళనకర అంశాలు వెలుగులోకి!
ఇటీవల దేశంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాల్లో నిర్వహించిన తనిఖీల్లో కొన్ని ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. అనేక చోట్ల వంట కోసం పాతవి, తుప్పుపట్టినవి, విరిగినవి లేదా సరిగా నిర్వహించని కత్తులు, పరికరాలు ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో కొత్త నిబంధనలను తీసుకొచ్చినట్లు FSSAI వెల్లడించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, క్యాటరింగ్ సంస్థలు ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.
అంతేకాకుండా వంటగదిలో పనిచేసే సిబ్బందికి పరిశుభ్రత, ఆహార భద్రతకు సంబంధించిన ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించింది. పరికరాల నిర్వహణ, శుభ్రత విషయంలో నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని తెలిపింది. ఆహార నాణ్యతను మెరుగుపరచడం, వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడడం, ఫుడ్ బిజినెస్ రంగంలో భద్రతా ప్రమాణాలను పెంచడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని FSSAI పేర్కొంది.