ప్రస్తుతం మీరు వాడుతున్న ఎల్పీజీ గ్యాస్ సేవలపై అసంతృప్తి ఉన్నా, గ్యాస్ సిలిండర్ డెలివరీ ఆలస్యం అవుతున్నా, సిబ్బంది వ్యవహార శైలి నచ్చకపోయినా ఇకపై గ్యాస్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఫిర్యాదులు చేయాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ‘డిస్ట్రిబ్యూటర్ పోర్టబిలిటీ’ సదుపాయం ద్వారా వినియోగదారులు ఇంట్లోనే కూర్చొని ఆన్‌లైన్‌లో తమ గ్యాస్ ఏజెన్సీని పూర్తిగా ఉచితంగా మార్చుకునే అవకాశం కల్పించింది. ఈ సదుపాయం ద్వారా ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు తమకు నచ్చిన కొత్త డిస్ట్రిబ్యూటర్‌ను ఎంచుకుని సేవలను కొనసాగించవచ్చు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ డెలివరీ సమస్యలు అధికంగా ఎదురవుతున్న నేపథ్యంలో ఈ విధానం వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా మారుతోంది. గతంలో గ్యాస్ ఏజెన్సీ మార్పు కోసం కార్యాలయాలకు వెళ్లి పలు దరఖాస్తులు ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మొత్తం ప్రక్రియను మొబైల్ ఫోన్ ద్వారానే పూర్తి చేసే సౌకర్యాన్ని ఆయా గ్యాస్ సంస్థలు అందుబాటులోకి తీసుకొచ్చాయి.
గ్యాస్ ఏజెన్సీని మార్చుకునేందుకు ముందుగా మీరు ఉపయోగిస్తున్న గ్యాస్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ అనువర్తనాన్ని తెరవాలి. అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, కస్టమర్ ఐడీ ద్వారా ఖాతాలోకి ప్రవేశించాలి. అక్కడ కనిపించే మెనూలో ‘డిస్ట్రిబ్యూటర్ పోర్టబిలిటీ’ అనే ఎంపికను ఎంచుకున్న తర్వాత మీ ప్రాంతానికి సమీపంలో ఉన్న అందుబాటులోని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల జాబితా కనిపిస్తుంది. వాటిలో మీకు అనుకూలమైన డిస్ట్రిబ్యూటర్‌ను ఎంపిక చేసుకోవాలి. అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసి అభ్యర్థనను సమర్పిస్తే ప్రక్రియ పూర్తవుతుంది. కొన్ని రోజుల్లోనే మీ గ్యాస్ కనెక్షన్ కొత్త డిస్ట్రిబ్యూటర్‌కు బదిలీ అవుతుంది. ఈ మార్పు సమయంలో మీ కస్టమర్ నంబర్, గ్యాస్ సబ్సిడీ, కనెక్షన్ వివరాల్లో ఎలాంటి మార్పు ఉండదు. అవన్నీ యథాతథంగా కొనసాగుతాయి. దీంతో వినియోగదారులు ఇబ్బందులు లేకుండా మెరుగైన సేవలు అందించే ఏజెన్సీని ఎంపిక చేసుకునే అవకాశం పొందుతున్నారు.
ఇక అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ ఆసియాలో ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన రవాణాపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతదేశం తన ఎల్పీజీ అవసరాల్లో దాదాపు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో సుమారు 90 శాతం ఎల్పీజీ సరఫరా ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ సముద్ర మార్గం ద్వారానే దేశానికి చేరుకుంటోంది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో సరఫరా వ్యవస్థకు ఆటంకాలు తలెత్తే ప్రమాదం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. దేశంలో ఎల్పీజీ కొరత రాకుండా ఉండేందుకు దేశీయ ఉత్పత్తిని 25 శాతం పెంచాలని ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ నిల్వలు పెంచడం, సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం వంటి చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.
ALSO READ: ఛీఛీ….వీడసలు భర్తేనా…అద్దె డబ్బులకు భార్యను, కూతురును…! చివరికి కటకటల్లోకి…