హైదరాబాద్,క్రైమ్‌మిర్రర్:తెలంగాణ బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై పట్టు సాధించేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలంగాణ పర్యటన తర్వాత కొంత నేతల్లో సమన్వయం కనిపిస్తుంది. అలాగే సెంటిమెంట్ ను రగిలించాలని బీజేపీ నేతలు ఈ ఎన్నికలకు సమాయత్తమవుతున్నట్లు అర్థమవుతుంది. తాజాగా బీజేపీ రాష్ట్ర నేతలు ఎంఐఎం, హైడ్రా ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. బీజేపీ చేస్తున్న విమర్శలకు ఎంఐఎం ప్రతి విమర్శలు చేస్తూ కమలం పార్టీ ట్రాప్ లో పడినట్లు కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే పతంగి పార్టీ విమర్శలతో బీజేపీ ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read:ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విషాదం.. ఫీజు సరిచేస్తూ విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
హైడ్రాను ముందర పెట్టి బీజేపీ విమర్శలకు గత కొద్ది రోజలుగా దిగుతోంది. హైడ్రా కేవలం సామాన్యులు, పేదలు జోలికి మాత్రమే పోతుందని, ఎంఐఎం నేతల ఆక్రమణల జోలికి వెళ్లడం లేదని ఆరోపిస్తుంది. బీజేపీ చీఫ్ రామ్ చందర్ రావు తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కూడా హైడ్రాపై వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏకపక్షంగా వ్యవహరిస్తుందని, ఎంఐఎంకు చెందిన ఆక్రమణల జోలికి వెళ్లడం లేదని బీజేపీ నేతలు ఆరోపించారు. ఫాతిమా కళాశాలను ఆక్రమించి నిర్మించారని, దానిని కూల్చివేయడంలో హైడ్రా అధికారులు ఎందుకు మీనమేషాలు లెక్కపెడుతున్నారని ప్రశ్నించారు. కేవలం పేదల ఇళ్లను కూల్చివేయడానికే హైడ్రాను ఏర్పాటు చేసినట్లుందని అభిప్రాయపడ్డారు. హైడ్రా కొందరి నిర్మాణాలనే కూల్చివేస్తుందని, హైకోర్టు ఎన్ని తీర్పులు చెప్పినా హైడ్రా మాత్రం తన వైఖరిలో మాత్రం మార్పు తీ రావడం లేదని బీజేపీ నేతలు అంటున్నారు.
Also Read:ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత గౌరవం.. బింటాంగ్ ఆదిపూర్ణ అవార్డుతో సత్కారం
దీనికి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. తమను భయపెట్టాలని కొందరు చూస్తున్నారని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. బెదిరింపులకు లొంగేది లేదని అన్నారు. ఎంఐఎంకు చెందిన విద్యాసంస్థలను కూల్చివేస్తామని కొందరు బెదిరిస్తున్నారని, కానీ ఇలాంటి బెదిరింపులకు తాము భయపడేది లేదని తెలిపారు. ఫాతిమా కళాశాలపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. తమ విద్యాసంస్థను ఎలా కాపాడు కోవాలో తమకు తెలుసునని అన్నారు. ఒక విద్యాసంస్థను కూల్చివేస్తే వంద విద్యాసంస్థలు నిర్మిస్తామని అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పారు. తమను బెదిరించి లొంగదీసుకోవాలని భావించడం అవివేకమని అన్నారు. దీంతో గ్రేటర్ ఎన్నికల వేళ సెంటిమెంట్ రగిలి హైదరాబాద్ మున్సిపల్ నగర పరిథిలో ఎక్కువ ఓటు బ్యాంకును సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి బీజేపీ ఈ వ్యూహంతో ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందన్నది చూడాల్సి ఉంది.