-
పట్టభద్రుల స్థానాలకు అభ్యర్థుల ఎంపికను మొదలుపెట్టిన హస్తం
-
ఒక్కో స్థానానికి ముగ్గురు ఆశావహులతో కూడిన జాబితా
-
వడబోత పనుల్లో భట్టి, దామోదర రాజనర్సింహ
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. మార్చిలో రెండు స్థానాలు ఖాళీ కానున్నాయి. సాధారణంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు ఆరు నెలలు ముందు నుంచే ప్రారంభం అవుతాయి. ఎందుకంటే ప్రతి ఎన్నికలకు అక్కడ ఓట్ల జాబితా మారుతూ ఉంటుంది. కొత్త ఓట్లు చేర్చాల్సి ఉంటుంది. పాత ఓటర్లు సైతం నమోదు కావాల్సి ఉంటుంది. అయితే రాజకీయ పార్టీలు సైతం ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. ఈ కొత్త ఓట్ల చేరిక బాధ్యతలను అభ్యర్థులే చూసుకుంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి.. ఒక్కో నియోజకవర్గానికి మూడు పేర్లతో ప్రతిపాదనలు పంపాలని అధిష్టానం సూచించింది.
ఎన్నికలకు సన్నాహాలు…
హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం.. వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల స్థానాలకు 2027 మార్చి తో గడువు ముగియనుంది. కేంద్ర ఎన్నికల సంఘం మరో రెండు మూడు నెలల్లో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టేందుకు సమాయత్తం అవుతుంది. రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక, ఓటర్ల నమోదు బాధ్యతల పై ముందస్తు చర్చలు జోరందుకుంటున్నాయి. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల తరహాలో ఉండవు. ప్రతి ఆరేళ్లకు ఒకసారి పాత ఓటర్ల జాబితా రద్దయి.. కొత్తగా ఫారం ఎయిటీన్ ద్వారా వాటర్ లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆశావహులు అధికం…
ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అధికార కాంగ్రెస్లో ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కో నియోజకవర్గానికి మూడు పేర్లతో ప్రతిపాదనలు పంపాలని అధిష్టానం సూచించింది. ఖమ్మం- వరంగల్- నల్గొండ స్థానానికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ స్థానానికి ఇన్చార్జిగా మంత్రి దామోదర్ రాజనర్సింహ లకు అభ్యర్థుల వడబోత బాధ్యతను అప్పగించారు. వారు పోటీకి ఆసక్తి చూపుతున్న ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మూడు పేర్లు చొప్పున ఎంపిక చేసి అధిష్టానానికి పంపిస్తారు. వాటిపై పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత ఏఐసీసీ నాయకత్వానికి పంపించనున్నారు. మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గం నుంచి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. అక్కడ బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని కాంగ్రెస్ చూస్తోంది. సామ రామ్మోహన్ రెడ్డి, హర్షవర్ధన్, గౌరీ సతీష్, వేణుగోపాల్ రెడ్డి, భీమ్ భారత్ ఆశావహులుగా ఉన్నారు. ఖమ్మం- వరంగల్- నల్గొండ నియోజకవర్గానికి పిసిసి అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్, గుప్త అమిత్ రెడ్డి, చలగాని దయాకర్, కైలాష్ నేత, ఒక మంత్రి సోదరుడి పేరు బలంగా వినిపిస్తోంది.
