-
కాంగ్రెస్ అగ్రనాయకత్వం పై కేటీఆర్ ఫైర్
-
ఏకంగా రాహుల్ గాంధీ పై గురి
-
కమల దళానికి దగ్గరవుతున్న సంకేతాలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: దేశంలో కాంగ్రెస్ బలహీనం కావచ్చు. కానీ తెలంగాణలో మాత్రం బలమైన పక్షమే. అందుకే గులాబీ పార్టీకి హస్తం టార్గెట్. ఆపై జాతీయస్థాయిలో భారతీయ జనతా పార్టీకి కూడా ఆ పార్టీ బద్ధ శత్రువు. అయితే కమలదళం విషయంలో వేరే ఆలోచనతో ఉన్న గులాబీ పార్టీ అగ్రనేతలు.. హస్తం పార్టీ విషయంలో మాత్రం కఠినంగా ఉంటున్నారు.
తాజాగా గులాబీ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. చాలా అగౌరవంగా మాట్లాడారు. దేశానికి ప్రధానమంత్రి కావాలని కలలు కొంటున్న రాహుల్ గాంధీ చేష్టలు పిరికిపందలా ఉన్నాయని.. ఇతరులకు భయభ్రాంతులకు గురి చేసేలా.. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు కేటీఆర్.
దేశవ్యాప్తంగా రాజ్యాంగ ప్రతిని చేతబట్టుకొని తిరుగుతున్న రాహుల్.. తెలంగాణలో మాత్రం తన కీలుబొమ్మ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా అరాచక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారంటూ ధ్వజమెత్తారు.
-
స్పష్టంగా చెప్పిన కేటీఆర్..
మొన్ననే ఢిల్లీలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బిజెపితో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదు అని తేల్చి చెప్పారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి బిజెపికి అనుకూల సంకేతాలు ఇచ్చారు కేటీఆర్. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్, సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ఆందోళన చేస్తోంది.
జాతీయస్థాయిలో బిజెపి వ్యతిరేక పార్టీలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే బిజెపికి అనుకూలంగా.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సంకేతాలు ఇచ్చారు కేటీఆర్.
వీధుల్లోకి వచ్చి ఓటు చోరీ అంటూ నినాదాలు చేస్తున్న రాహుల్ గాంధీ.. తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద ఓటు దొంగగా, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలవేళ నీతులు చెప్పే కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో మాత్రం రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చిందంటూ ఆరోపణలు చేశారు.
-
కాంగ్రెస్ అగ్ర నాయకత్వం పై విసుర్లు..
దేశంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు అంటూ కేటీఆర్ చేసిన ఆరోపణ.. బిజెపికి దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నం గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత కొంతకాలంగా గులాబీ పార్టీ కమలదళంతో దోస్తీ చేస్తుందన్న అనుమానాలు ఉన్నాయి.
ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నట్లు కేటీఆర్ తాజాగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం పై విరుచుకుపడ్డారు. అయితే కేటీఆర్ మాటల్లో కాంగ్రెస్ పార్టీ కంటే రేవంత్ రెడ్డి పై ఉన్న ద్వేషం బయటపడుతోంది. రేవంత్ కు రాహుల్ గాంధీ ప్రోత్సహిస్తున్నారన్న ఆగ్రహం కేటీఆర్ మాటల్లో ధ్వనిస్తోంది. బిజెపికి తాము దగ్గరగా ఉన్నట్లు సంకేతాలు చూపించారు కేటీఆర్.
ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసుకున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా.. తాము బిజెపికి దగ్గర అనే సంకేతాలు ప్రజల్లోకి పంపించారు. మరో రెండేళ్లలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న క్రమంలో కేటీఆర్ తాజాగా చేసిన కామెంట్స్ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో సరికొత్త సమీకరణలకు దారి తీయనున్నాయి. చూడాలి చివరకు ఏం జరుగుతుందో.
