చారిత్రక కోహినూర్ వజ్రం విషయం మరోసారి చర్చకు వచ్చింది. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తాజాగా ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు అవకాశం లభిస్తే బ్రిటన్ రాజు చార్లెస్ IIIను కలుసుకుని, కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇవ్వాలని కోరతానన్నారు. భారతీయ మూలాలు కలిగిన మమ్దానీ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆసక్తికరంగా మారింది.
న్యూయార్క్ కు వచ్చిన కింగ్ చార్లెస్ III
ఇటీవల రాజు చార్లెస్ III మరియు రాణి కెమిల్లా అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ కు వచ్చారు. బుధవారం వారు 9/11 స్మారక స్థలాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమానికి ముందు మమ్దానీ మీడియాతో మాట్లాడారు. అప్పుడే కోహినూర్ అంశాన్ని ప్రస్తావిస్తూ, ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం వస్తే ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని అన్నారు. తర్వాత రాజు చార్లెస్ III, మమ్దానీ మధ్య సమావేశం జరిగినట్లు సమాచారం. అయితే, ఆ సమావేశంలో కోహినూర్ గురించి చర్చ జరిగిందా? లేదా? అన్నది తెలియలేదు. ఈ విషయంపై బకింగ్ హామ్ ప్యాలెస్ స్పందించేందుకు నిరాకరించింది. అలాగే మేయర్ కార్యాలయం కూడా వారి సంభాషణ వివరాలను వెల్లడించలేదు.
కోహినూర్ వజ్రం గురించి..
కోహినూర్ వజ్రానికి చాలా కాలం చరిత్ర ఉంది. ఇది సుమారు 108 క్యారెట్ల విలువైన వజ్రంగా గుర్తింపు పొందింది. 1849లో మహారాజా దులీప్ సింగ్ ఈ వజ్రాన్ని బ్రిటిష్ రాణి విక్టోరియాకు అప్పగించారు. అప్పటి నుంచి ఇది బ్రిటన్ రాజ కుటుంబం ఆధీనంలోనే ఉంది. ప్రస్తుతం రాణి కిరీటంలో ఈ వజ్రం అమర్చబడి ఉంది. భారత్ ప్రభుత్వం ఈ వజ్రాన్ని తిరిగి తీసుకురావడానికి పలు మార్లు దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ ఇప్పటి వరకు సాధ్యపడలేదు. కోహినూర్ వజ్రం అంశం తరచూ చర్చకు వస్తూనే ఉంది.