-
కవిత పార్టీ ఏర్పాటు వెనుక కేసీఆర్…?
-
బిజెపితో బీఆర్ఎస్ జత …
-
తెలంగాణ సెంటిమెంట్ రగిలించే బాధ్యత కుమార్తెకు
-
ద్విముఖ వ్యూహంలో పొలిటికల్ చాణుక్యుడు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కల్వకుంట్ల కవిత ప్రస్తావన ఎక్కువగా జరుగుతోంది. ఆమె స్థాపించిన టిఆర్ఎస్ హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే కొత్త పార్టీ ఏర్పాటు వెనుక కేసీఆర్ వ్యూహం దాగి ఉందా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో రాజకీయ శూన్యతను పూరించేందుకు కెసిఆర్ స్వయంగా రచించిన మాస్టర్ ప్లాన్ లో భాగమా? అనే అనుమానాలు కూడా చాలామందిలో ఉన్నాయి. పదేళ్లపాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన ఒక ప్రాంతీయ పార్టీ నుంచి.. అదే కుటుంబానికి చెందిన సభ్యురాలు విడిపోయి కొత్త పార్టీ ఏర్పాటు చేయడం అంత సులువైన విషయం కాదు. కచ్చితంగా దీని వెనుక కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఉంటుందన్నది ఎక్కువమంది అనుమానం.
సెంటిమెంటును వదలడంతోనే…
తెలంగాణ సెంటిమెంటు ఉన్నంతవరకు తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగులేకుండా పోయింది. ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితిగా మారిందో నాడే తెలంగాణ సమాజానికి దూరమైంది కేసీఆర్ పార్టీ. దీనిపై కేసీఆర్ కు స్పష్టమైన అవగాహన కూడా ఉంది. జాతీయస్థాయిలో ఉన్న పరిణామాలు.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థిగా మారిన తరుణంలో.. బిజెపితో పొత్తు.. లేకుంటే విలీనం అనేది అనివార్యంగా కనిపిస్తోంది. బిజెపితో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్న మరుక్షణం తెలంగాణలో పక్కా ప్రాంతీయ వాదాన్ని వినిపించే మరో పార్టీకి అవకాశం చిక్కుతుంది. అయితే ఆ ఛాన్స్ వేరొకరికి ఇవ్వకుండా.. తన కుమార్తె కవితతో పార్టీ పెట్టించారు అనేది కెసిఆర్ పై వస్తున్న విమర్శ. ఆపై పార్టీ పేరు విషయంలో కూడా మళ్లీ టిఆర్ఎస్ వచ్చేలా ప్రణాళిక రచించింది కూడా ఆయనేనని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.
ఆ ఆలోచనతోనే కుమార్తెకు…
తెలంగాణ సెంటిమెంట్‌తో రెండుసార్లు అధికారంలోకి వచ్చారు కెసిఆర్. ప్రజలు మరోసారి ఛాన్స్ ఇవ్వలేదు. ప్రజల వైఖరి మారుతోందని కెసిఆర్ కూడా గ్రహించారు. అందుకే ప్రత్యామ్నాయంగా తన కుమార్తె కవితను ప్రోత్సహించడం ప్రారంభించారు. అందుకే తెలంగాణ ఆత్మగౌరవం, సెంటిమెంట్ వంటి అంశాలను కవిత భుజానికి ఎత్తుకున్నారు. అనివార్య పరిస్థితుల్లో కెసిఆర్ పార్టీ బిజెపితో జతకడితే.. తమ కుటుంబంలోనే ఒక ప్రాంతీయ పార్టీ ఉంటుందన్న ఆలోచనతోనే కవితతో ఈ పని చేయించారు అనేది తెలంగాణ పొలిటికల్ పండితుల వాదన. ప్రాంతీయ పార్టీ అస్తిత్వాన్ని తన కుటుంబ సభ్యుల ద్వారా భద్రపరుచుకోవాలన్న ఆలోచనలో పుట్టుకొచ్చిందే కవిత టిఆర్ఎస్ అని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది.
బిజెపితో పొత్తు…
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే బిఆర్ఎస్ ముందు ఉన్న ఏకైక ఆప్షన్ బిజెపి. కాషాయ దళంతో జతకట్టి రాజకీయంగా పూర్వ వైభవం సాధించాలి. అదే సమయంలో తెలంగాణ సెంటిమెంటును బలంగా ఉంచే ఒక ప్రాంతీయ పార్టీ కావాలి. అందుకే కవితను అలా సెట్ చేసారు కెసిఆర్. కవిత మళ్లీ గ్రామీణ స్థాయిలోకి వెళ్లి తెలంగాణ సంస్కృతి, సెంటిమెంట్ ఆధారంగా పార్టీని నిర్మించవచ్చు. రేపు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రాంతీయ పార్టీ రూపంలో కవిత బలమైన పోటీదారుగా ఉంటారు.
అవసరం అనుకుంటే కొన్ని స్థానాల్లో కవిత గెలిస్తే కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది. ఒక్క పార్టీకి తన కుమారుడు కేటీఆర్ ను.. మరో బలమైన ప్రాంతీయ పార్టీని కుమార్తె కవితకు అప్పగించడం ద్వారా కేసీఆర్ ద్విముఖ వ్యూహంతో ఉన్నట్టు అర్థం అవుతోంది. అయితే ప్రజలకు ఇది తెలియకుండా ఉంటేనే ఈ మంత్రాంగం పనిచేస్తుంది. లేకుంటే మాత్రం వికటిస్తుంది. ప్రస్తుతం అపజయాలతో కెసిఆర్ వెనక్కి తగ్గారు. కానీ ఆయన వ్యూహాలు ఎవరికి అందనంతగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఫ్రెండ్లీ ఫ్యామిలీ మ్యాచ్‌లో ఎలా నెగ్గుకొస్తారో చూడాలి.