క్రైమ్ మిర్రర్ : మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న వివాదం చివరకు హత్యకు దారి తీసిన ఘటన కొత్త మొల్గర గ్రామంలో కలకలం రేపింది. భర్త గొడ్డలితో దాడి చేయడంతో భార్య ప్రాణాలు కోల్పోయింది. గ్రామానికి చెందిన కంపిల్ల వెంకటయ్య, ఆయన భార్య అలివేలు (50) మధ్య కొంతకాలంగా కుటుంబ విషయాలపై గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో శనివారం ఉదయం మరోసారి ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన వెంకటయ్య ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్యపై దాడి చేశాడు.
ఈ దాడిలో అలివేలు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. భార్యాభర్తల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని మృతురాలి కుమార్తె మంజుల తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఇతర వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.
also read : ప్రాణాలను పణంగా పెట్టి వెళ్లారు.. చివరికి ఖాళీ చేతులతో వెనక్కి!
