•బిజెపి తరఫున ఎంపిక
•గట్టి ప్రయత్నాల్లో మాజీ ముఖ్యమంత్రి
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:-ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావాలని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి జూన్ 21న నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వారి స్థానంలో కొత్త వారి ఎంపిక అనివార్యంగా మారింది. ఏ క్షణంలోనైనా ఆ నాలుగు స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో బిజెపి తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. బలమైన స్థానం కావడంతో ఓడిపోతానని తెలిసి కూడా ఆయన బరిలో నిలిచారు. గట్టి పోటీ ఇచ్చారు. అందుకే రాజ్యసభకు తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి.
సుదీర్ఘ నేపథ్యం..
కిరణ్ కుమార్ రెడ్డి ది సుదీర్ఘ రాజకీయ నేపథ్య కుటుంబం. చిత్తూరు జిల్లా నుంచి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోంది నల్లారి కుటుంబం. కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా సేవలందించారు. ఆయన అకాల మరణంతో కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. చాలాసార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2004లో గెలిచేసరికి మంత్రి పదవి ఆశించారు. కానీ రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఇచ్చారు. 2009లో గెలిచేసరికి శాసనసభ స్పీకర్ గా అవకాశము లభించింది. కానీ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు రోశయ్య. పొలిటికల్ గా కొంచెం ఇబ్బంది పడ్డారు. దీంతో రోశయ్య స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చింది హై కమాండ్. మంచి పాలన అందించాలన్న పేరు దక్కించుకున్నారు. అయితే రాష్ట్ర విభజన ఒకవైపు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం మరోవైపు.. ఏపీలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసింది. అందుకే 2014లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశారు కిరణ్ కుమార్ రెడ్డి. ఆ ఎన్నికల్లో ఓటమితో కొద్దిరోజులపాటు సైలెంట్ అయ్యారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. భారతీయ జనతా పార్టీలో చేరి మొన్నటి ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి పొత్తులో భాగంగా బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
ఎంపీగా పోటీ చేసినప్పుడే హామీ..
వాస్తవానికి రాజంపేట నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అక్కడ గతంలో రెండు సార్లు ఎంపీగా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. మూడోసారి ఆయన వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అక్కడ ఓటమి తప్పదు అని తెలిసిన కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమి చవిచూశారు. అయితే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలోనే తనకు రాజ్యసభ పదవి ఇవ్వాలన్న షరతు పెట్టినట్లు ప్రచారం నడిచింది. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి ఆ ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.