కుంభమేళా సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అయి కుంభమేళా మోనాలిసాగా గుర్తింపు పొందిన యువతి కేసులో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అందుబాటులో ఉన్న పత్రాల ప్రకారం ఆమెను మేజర్ గా పరిగణించవచ్చని కోర్టు అభిప్రాయపడింది. అలాగే ఆమె భర్త మహమ్మద్ ఫర్మాన్ కు ఒక నెలపాటు ట్రాన్సిట్ బెయిల్ మంజూరు చేసింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా, కేరళకు చెందిన మహమ్మద్ ఫర్మాన్ ను ఈ ఏడాది ప్రారంభంలో వివాహం చేసుకుంది. అయితే తన కుమార్తె ఇంకా మైనర్ అని, ఫర్మాన్ ఆమెను కిడ్నాప్ చేశాడని మోనాలిసా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మధ్యప్రదేశ్ లో కేసు నమోదు అయింది. అరెస్టు భయంతో ఫర్మాన్, మోనాలిసా కలిసి కేరళ హైకోర్టును ఆశ్రయించి ట్రాన్సిట్ బెయిల్ కోరారు. విచారణ సందర్భంగా కోర్టుకు సమర్పించిన జనన ధ్రువీకరణ పత్రం, ఓటరు గుర్తింపు కార్డు, బ్యాంక్ పాస్ బుక్ వంటి పత్రాలను పరిశీలించిన న్యాయస్థానం, మోనాలిసా పుట్టిన తేదీ 2008 జనవరి 1గా నమోదైందని పేర్కొంది. అందువల్ల ప్రస్తుతం ఆమె మేజర్ గా ఉన్నట్లు భావించవచ్చని తెలిపింది.
మరోవైపు మధ్యప్రదేశ్ పోలీసుల తరఫున వాదించిన న్యాయవాది, యువతి ఇంకా మైనర్ అని, సమర్పించిన పత్రాలు నకిలీవని ఆరోపించారు. అలాగే హిందూ యువతి, ముస్లిం యువకుడి వివాహం ఆలయంలో జరగడం చట్టబద్ధం కాదని, వివాహ నమోదు కూడా చెల్లదని వాదించారు. అయితే ఈ వాదనలను కోర్టు అంగీకరించలేదు. ఆరోపణలపై దర్యాప్తు కొనసాగాలని పేర్కొంది.
నెల పాటు ట్రాన్సిట్ బెయిల్
ఫర్మాన్ కు జూన్ 3 నుంచి ఒక నెలపాటు ట్రాన్సిట్ బెయిల్ మంజూరు చేసిన కోర్టు, ఆ సమయంలో మధ్యప్రదేశ్‌లోని సంబంధిత కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందవచ్చని సూచించింది. ఈ గడువులో అతడిని అరెస్టు చేయవద్దని కూడా ఆదేశాలు జారీ చేసింది.