HomeజాతీయంKC Venugopal: కేరళ తదుపరి సీఎం గా వేణుగోపాల్, ముగ్గురు నేతలు పోటీపడ్డా కేసీ వైపే...

KC Venugopal: కేరళ తదుపరి సీఎం గా వేణుగోపాల్, ముగ్గురు నేతలు పోటీపడ్డా కేసీ వైపే అధిష్టానం మొగ్గు!

Kerala New CM KC Venugopal: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి విజయం సాధించడంతో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్న చర్చ మొదలైంది. ప్రస్తుతం సీఎం పదవికి కాంగ్రెస్ లో పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, లోక్‌సభ సభ్యుడు కేసీ వేణుగోపాల్ పేరు ముందంజలో ఉన్నట్లు సమాచారం. పార్టీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్‌లు రాష్ట్రంలోని పరిస్థితులపై తమ నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అందజేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

సీఎం రేసులో ముగ్గురు నేతలు

ఎమ్మెల్యేల అభిప్రాయాలు, కూటమి భాగస్వామ్య పార్టీల సూచనలు, ప్రజల్లో ఉన్న అభిమతం వంటి అంశాలను పరిశీలించి పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోనుంది. సీఎం పదవికి కేసీ వేణుగోపాల్‌తో పాటు మాజీ ప్రతిపక్ష నేత వీడి సతీశన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రమేష్ చెన్నితాల పేర్లు కూడా చర్చలో ఉన్నాయి. అయితే అధిష్ఠానానికి అత్యంత సన్నిహితుడిగా, నమ్మకమైన నాయకుడిగా గుర్తింపు ఉన్న వేణుగోపాల్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఎవరీ కేసీ వేణుగోపాల్

63 ఏళ్ల కేసీ వేణుగోపాల్ చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో పార్టీ వ్యవహారాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది. కేరళలో యూడీఎఫ్ విజయానికి ఆయన వ్యూహాలు ముఖ్య కారణమని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. పార్టీ శ్రేణుల్లో కూడా ఆయనకు మంచి మద్దతు కనిపిస్తోంది.  వేణుగోపాల్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తే ఆయన ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక బాధ్యతలు చేపట్టేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవల కాంగ్రెస్ కార్యకర్తలు బహిరంగంగానే వేణుగోపాల్‌కు మద్దతు ప్రకటించారు. పార్టీ కార్యాలయాల దగ్గర ఆయనకు అనుకూలంగా పోస్టర్లు కూడా కనిపించాయి.  యూడీఎఫ్ విజయానికి అసలైన వ్యూహకర్త అంటూ ఆయనను ప్రశంసిస్తూ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. దీంతో కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా కేసీ వేణుగోపాల్ పేరు మరింత బలంగా వినిపిస్తోంది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు