- కౌన్సిలర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నేత
- మమతా బెనర్జీని రెండుసార్లు ఓడించిన జెయింట్ కిల్లర్
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్:పశ్చిమ బెంగాల్ సీఎం విషయంలో బిజెపి కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ నేత సువేందు అధికారిని ఖరారు చేసింది. రెండుసార్లు మమతా బెనర్జీని ఓడించిన సువేందు వైపే బిజెపి అగ్రనేతలు మొగ్గు చూపారు. కోల్కత్తాలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందూ అధికారి పేరును అమిత్ షా ప్రకటించారు. శనివారం ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, బిజెపి పాలిత ముఖ్యమంత్రి, ఎన్డీఏ పక్ష సీఎంలు హాజరుకానున్నారు.
కౌన్సిలర్ గా రాజకీయ ప్రస్థానం…
ఒక సాధారణ కౌన్సిలర్ నుంచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి చేరుకున్నారు సువేందూ అధికారి. 1970 డిసెంబర్ 15న తూర్పు మేదినీపూర్ లోని కుర్కులీలో జన్మించారు. ఎంఏ వరకు చదివిన ఆయనది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. తండ్రి సిసిర్ అధికారి ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. సువేందు 1995లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ గా గెలిచారు. 1998లో తండ్రితో కలిసి టీఎంసీలో చేరారు. ఆ పార్టీలో రాజకీయంగా ఎదిగారు. 2006లో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
మమతాకు అండగా…
మమతా బెనర్జీ రాజకీయ ఉన్నతికి ఎంతగానో పాటుపడ్డారు సువేందు అధికారి. 2007లో నందిగ్రామ్ ఉద్యమం మమతా బెనర్జీ తో పాటు ఆయన రాజకీయ జీవితానికి ఒక మలుపు. నంది గ్రామంలో పదివేల ఎకరాలు సమీకరించి స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేయాలని అప్పటి వామపక్ష ప్రభుత్వం భావించింది. దానికి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది. దానిని ముందుండి నడిపించారు సువేందు అధికారి. నంది గ్రామ్ ఉద్యమం విజయవంతం కావడంతో ఆయన ప్రాబల్యం పార్టీలో పెరిగింది. కీలక బాధ్యతలు కట్టబెట్టారు.
మమతా బెనర్జీ. 2009లో ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2016లో నందిగ్రామ్ ఎమ్మెల్యేగా గెలిచి మమతా బెనర్జీ మంత్రివర్గంలో చేరారు. తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుడు ముకుల్ రాయ్ 2017లో పార్టీకి గుడ్ బై చెప్పారు. అటు తరువాత పార్టీలో సువేందు అధికారి ప్రభావం పెరుగుతూ వచ్చింది.
అలా విభేదించి బయటకు…
టీఎంసీలో మమతా బెనర్జీ తర్వాత రెండో స్థానం ఎవరిది అంటే సువేందూ అధికారి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఇంతలో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో అధికారికి ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం.. మమతా బెనర్జీ ఆయనకే ప్రాధాన్యం ఇస్తుండడంతో సువేందూ అధికారి వ్యతిరేకించడం ప్రారంభించారు. ఇంతలో శారదా కుంభకోణంలో ఆరోపణలు రావడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
అందుకే 2020 చివర్లో టీఎంసీలు వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీని సవాల్ చేస్తూ నందిగ్రామ్ నియోజకవర్గం లో ఆమెపై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచారు సువేందూ అధికారి. కానీ ఆ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రాకపోవడంతో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. ఇప్పుడు భవానీపురం నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీని ఓడించడంతో రికార్డు సృష్టించారు. బిజెపి ఆయన సత్తాను గుర్తించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది.