నల్గొండ జిల్లా వైద్యారోగ్య శాఖలో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగి మరణించిన తేదీని మార్చి, ఆయన విధుల్లో ఉండగానే చనిపోయినట్లు తప్పుడు రికార్డులు సృష్టించారు. ఈ నకిలీ పత్రాల ఆధారంగా మృతుడి కుమారుడికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారంలో కుటుంబ సభ్యులు, ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన సిబ్బంది సహా మొత్తం 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రిటైర్మెంట్ తర్వాత మరణం.. ముందే చనిపోయినట్లు రికార్డులు!
శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేసిన చామకూరి వెంకటేశ్వర్లు 2025 మే 31న పదవీ విరమణ చేశారు. అనారోగ్య సమస్యలతో అదే ఏడాది నవంబర్ 17న మృతి చెందారు. అయితే, కారుణ్య నియామకం పొందాలంటే ఉద్యోగి విధుల్లో ఉన్న సమయంలో మరణించి ఉండాలి. ఈ నిబంధనను అధిగమించేందుకు ఆయన కుటుంబ సభ్యులు కొందరు అధికారుల సహకారంతో అక్రమ మార్గాన్ని ఎంచుకున్నట్లు విచారణలో తేలింది.
వెంకటేశ్వర్లు 2025 మే 28న, అంటే పదవీ విరమణకు ముందే మరణించినట్లు నకిలీ పత్రాలు రూపొందించారు. ఇందుకోసం తొలుత ఆయన ఆధార్ కార్డులోని చిరునామాను మీ-సేవా కేంద్రం ద్వారా నల్గొండ పట్టణానికి మార్చినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మున్సిపల్ అధికారుల సహకారంతో తప్పుడు వివరాలతో మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందినట్లు వెల్లడైంది.
రూ.13 లక్షలతో ఉద్యోగం కోసం ఒప్పందం!
ఈ నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలను ఉపయోగించి వెంకటేశ్వర్లు కుమారుడు చామకూరి రాజుకు దామరచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగం ఇప్పించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ వ్యవహారంలో సుమారు రూ.13 లక్షల మేర డబ్బుల లావాదేవీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య వసంత, డీఎంహెచ్‌వో కార్యాలయానికి చెందిన సీసీ పోలె రంజిత్ కుమార్‌తో కలిసి ఈ వ్యవహారాన్ని నడిపినట్లు గుర్తించారు.
14 మంది అరెస్ట్.. నగదు, ఫోన్లు స్వాధీనం
ఈ అక్రమ వ్యవహారంపై నల్గొండ మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ నవంబర్ 4న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మృతుడి భార్య వసంత, కుమారుడు రాజుతో పాటు బంధువులు, మున్సిపల్ వార్డు ఆఫీసర్ శివ జనార్ధన్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రదీప్ రెడ్డి సహా మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి రూ.5 లక్షల నగదు, ఒక కంప్యూటర్, 12 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలిస్తున్నామని తెలిపారు.
also read: డబ్బు ఆశతో ఘాతుకం.. నాలుగేళ్ల బాలుడిని హత్య చేసి అవయవాల విక్రయానికి యత్నం!
