-
వంద దేశాల నుంచి 450 మంది ప్రతినిధుల రాక
-
ఈనెల 12 నుంచి మూడు రోజులపాటు పారిశ్రామిక పెట్టుబడుల సదస్సు
-
హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహణ
-
చురుగ్గా ఏర్పాట్లు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత్ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఎందుకు భాగ్యనగరం వేదికగా మారనుంది. టెక్నాలజీ, పారిశ్రామిక, సాంస్కృతిక రంగాల్లో గ్లోబల్ హబ్ గా మారుతున్న భాగ్యనగరం అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు ముందుకొచ్చింది. సన్నాహాలు కూడా ప్రారంభించింది. నగరంలోని ప్రఖ్యాత హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ లో సదస్సు జరగనుంది. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ వేడుకకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు నవంబర్ 12 నుంచి 14 వరకు మూడు రోజులపాటు సాగనుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు, వివిధ రంగాల నిపుణులు, పారిశ్రామిక దిగ్గజాలు, విదేశీ రాయబారులు హాజరుకానున్నారు.
గొప్ప వేదికగా…
భారతదేశం సాధిస్తున్న సాంకేతిక పురోగతి, ఆర్థిక వృద్ధి, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచ వేదికపై చాటి చెప్పేందుకు ఈ సమ్మిట్ గొప్ప వేదికగా నిలవనుంది. వివిధ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచడంతో పాటు.. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. అధునాతన సాంకేతికతలైన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీస్ భవిష్యత్తు ఆవిష్కరణలపై ప్రత్యేకంగా చర్చిస్తారు. సదస్సుకు గ్లోబల్ ఇన్వెస్టర్లు, స్టార్టాప్ ఫౌండర్లు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. వారి మధ్య ఒప్పందాలు జరగనున్నాయి.
ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలతో…
ఈ సదస్సుకు సంబంధించి సన్నాహాలు మొదలయ్యాయి. భారతీయ సంస్కృతి, కలలు మరియు సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి.. విదేశీ అతిధులకు ఈ సదస్సు ద్వారా ఘనస్వాగతం పలకనున్నారు. తెలంగాణ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సు ద్వారా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించేందుకు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం రెడీ అవుతోంది. పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భద్రత ఏర్పాట్లతోపాటు అతిధుల వసతి, రవాణా సౌకర్యాల కల్పన కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సదస్సు విజయవంతం కావడం ద్వారా హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేందుకు సిద్ధపడుతోంది.
