దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ సమీపంలో ఉన్న శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అమ్మవారి ఖజానా నుంచి పవిత్ర నాణేల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.
ఆదివారం సాయంత్రం ప్రారంభమైన నాణేల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు చేరుకుంటున్నారు. అమ్మవారి దర్శనం చేసుకుని నాణేలు స్వీకరించేందుకు గంటల తరబడి వేచి చూస్తున్నారు. భక్తుల రాక పెరగడంతో క్యూలైన్లు గుల్జార్ హౌస్ వరకు విస్తరించాయి.
భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం నాలుగు క్యూలైన్ల ద్వారా నాణేల పంపిణీ చేపడుతున్నారు. భక్తులు క్రమపద్ధతిలో ముందుకు వెళ్లేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
అమ్మవారి ఖజానా నుంచి అందించే నాణేలను ఇంటికి తీసుకెళ్లి భద్రపరుచుకుంటే లక్ష్మీకటాక్షం కలుగుతుందని, కుటుంబంలో సిరిసంపదలు వృద్ధి చెందుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ విశ్వాసంతోనే ప్రతి సంవత్సరం దీపావళి సమయంలో ఈ నాణేల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తుంటారు.
మొత్తం మూడు రోజుల పాటు ఈ నాణేల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. దీంతో రానున్న రెండు రోజుల్లో కూడా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీపావళి వేడుకల వేళ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తుల సందడితో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
also read: దీపావళి వేడుకల్లో నాన్వెజ్.. నెటిజన్ల విమర్శలకు గురైన ప్రియాంక చోప్రా!
