హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: తెలుగు రాష్ర్టాల ప్రజలు భానుడి భగభగలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక వైపు ఉక్క పోత ఎండలు కుంపటిలా మారాయి. దీంతో ప్రజలు ఎటు వెళ్ల లేక, దూర ప్రయాణాలను సైతం వాయిదా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ ప్రజలకు చల్లటి కబురుతో పాటు ఓ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
ఈ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అంచనా వేశారు. అదేవిధంగా తిరుపతి, చిత్తూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. పిడుగుపాటు ప్రమాదం ఉన్నందున ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద ఆశ్రయం తీసుకోకూడదని ప్రజలకు సూచించారు.
తెలంగాణలో కూడా వర్షాలు…
తెలంగాణలో కూడా అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. సోమవారం పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురిసి నష్టం కలిగించింది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటీవల ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల 2 నుంచి 7 సెంటీమీటర్ల వరకు వర్షం పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అకాల వర్షాల కారణంగా పంటలకు నష్టం కలగొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిస్థితిని గమనిస్తూ రైతులకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది.