ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: చైనాలో హునాస్ ప్రావిన్స్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. యాంగ్ నగరంలో సోమవారం సాయంత్రం వేళ ఓ బాణసంచా కర్మాగారంలో అత్యంత శక్తిమంతమైన పేలుడు సంభవించింది. గ్వాండ్ టౌన్‌షిప్‌లోని లియుయాంగ్ హువాషెంగ్ ఫైర్‌వర్క్స్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు చెందిన కర్మాగారంలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 61 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం గురించిన సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టడం సహా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా నియమాలను అమలు చేయాలని అధికారులకు సూచించారు.