HomeతెలంగాణTelangana Rains: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం!

Telangana Rains: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం!

తెలంగాణలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉదయం వరకు ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ, సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు, వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఉపశమనం లభించింది.

ముఖ్యంగా నిజామాబాద్‌, జనగాం, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో అత్యధికంగా 8.2 సెంటీమీటర్ల వర్షం కురవగా, జనగాం జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో 7.4 సెంటీమీటర్ల వర్షం పడింది. సిరికొండ, మోస్రా, తూంపల్లి, ధర్పల్లి, నవీపేట ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మంచి వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లా మల్యాల్‌, మల్లాపూర్‌ ప్రాంతాల్లో కూడా రైతులకు అనుకూలంగా వర్షం కురిసింది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దామరచర్ల మండలం తిమ్మాపురంలో అత్యధికంగా 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా అనంతగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో కూడా మంచి వర్షం కురిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాయంత్రం గంటన్నర పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. బోనకల్‌లో అత్యధికంగా 79.5 మిల్లీమీటర్ల వర్షం నమోదు కాగా, వైరా, కల్లూరు, రఘునాథపాలెం ప్రాంతాల్లోనూ భారీ వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో కూడా వర్షాలు కురిశాయి.

అయితే ఈ వర్షాలు విషాదాన్ని కూడా మిగిల్చాయి. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలానికి చెందిన జెడ్డి దావీదు అనే యువకుడు పొలంలో పని చేస్తున్న సమయంలో పిడుగు పడి మృతి చెందాడు. కరీంనగర్‌కు చెందిన 11 ఏళ్ల బాలుడు ప్రణీత్ కూడా పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయాడు. నిజామాబాద్‌ జిల్లా టాక్లి గ్రామంలో రెండు గేదెలు కూడా పిడుగుపాటుకు చనిపోయాయి. ఇదిలా ఉండగా, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు