Homeక్రైమ్ఆస్పత్రి టాయిలెట్‌లో నర్సు అనుమానాస్పద మృతి..

ఆస్పత్రి టాయిలెట్‌లో నర్సు అనుమానాస్పద మృతి..

క్రైమ్ మిర్రర్ : పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రిలో నర్సు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. నీల్‌రతన్‌ సిర్కార్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లోని గైనకాలజీ విభాగంలో పనిచేస్తున్న 30 ఏళ్ల రూపాలి బర్మన్‌.. విధుల్లో ఉండగానే ఆస్పత్రి టాయిలెట్‌లో అపస్మారక స్థితిలో కనిపించింది. అనంతరం వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.

టాయిలెట్‌లోకి వెళ్లి.. తిరిగి రాలేదు

రూపాలి బర్మన్‌ బుధవారం రాత్రి 8 గంటల సమయంలో నైట్‌ డ్యూటీకి హాజరైనట్లు అధికారులు తెలిపారు. రాత్రి సుమారు 10.20 గంటలకు ఓ రోగికి వైద్య సేవలు అందించిన అనంతరం ఆమె హెచ్‌డీ యూనిట్‌లోని టాయిలెట్‌కు వెళ్లింది. చాలాసేపటి వరకు ఆమె బయటకు రాకపోవడంతో సహచర నర్సులు ఆందోళనకు గురయ్యారు. టాయిలెట్‌ తలుపు తట్టి పిలిచినా ఎలాంటి స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చి తలుపును బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ రూపాలి నేలపై అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించారు.

ఆస్పత్రికి తరలించేలోపే మృతి

సహచర సిబ్బంది వెంటనే ఆమెను ట్రాలీపై చికిత్స కోసం తరలించారు. అయితే వైద్యులు పరీక్షించే సమయానికే రూపాలి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆమె మృతికి అసలు కారణం ఏంటనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

సీసీటీవీ ఫుటేజ్‌పై పోలీసుల దృష్టి

రూపాలి ఆత్మహత్య చేసుకున్నట్లు భావించడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని పోలీసు అధికారి తెలిపారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు టాయిలెట్‌ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆమె టాయిలెట్‌లోకి వెళ్లిన తర్వాత ఏం జరిగింది? ఎంతసేపు అక్కడ ఉంది? ఆమెకు ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తిందా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఆరోగ్యశాఖ కూడా విచారణ

ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్‌ ఆరోగ్యశాఖ కూడా స్పందించింది. నర్సు మృతికి సంబంధించిన కారణాలను తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఘటనపై సమగ్రంగా విచారణ జరిపి ఏడు రోజుల్లోగా నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించింది. పోస్టుమార్టం నివేదిక, సీసీటీవీ ఫుటేజ్‌, సహచర సిబ్బంది వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాతే నర్సు మృతికి అసలు కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : దృశ్యం’ సినిమాను తలపించే సీన్.. భర్తను చంపి ఇంట్లోనే పాతిపెట్టేందుకు భార్య ప్లాన్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు