-
పిల్లల మధ్య నలిగిపోతున్న తల్లి
-
రోజురోజుకు పెరుగుతున్న ఆస్తి వివాదాలు
-
ఆవేదనలో వైయస్ కుటుంబ అభిమానులు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైయస్ రాజశేఖర్ రెడ్డి.. తెలుగు రాజకీయాల్లో ఒక బ్రాండ్. ప్రాంతీయ పార్టీల దెబ్బకు పూర్తిగా కనుమరుగైన కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిన మహానేత. ఏపీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడమే కాదు. జాతీయ స్థాయిలో సైతం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన నాయకుడు. సంక్షేమ తారక మంత్రంతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఇప్పుడు వ్యక్తిగత విభేదాలతో ఏర్పడిన కల్లోలం కట్టు దాటుతోంది. తల్లి విజయమ్మ ఇద్దరి పిల్లల మధ్య నలిగిపోతోంది. అన్నాచెల్లెళ్ల మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతుండగా.. తాజాగా బెంగళూరులోని యలహంక ప్యాలెస్ వివాదం తెరపైకి వచ్చింది. కోర్టు వరకు వెళ్ళింది. తన కుమార్తె పెళ్లి వేదికగా ఎలహంక ప్యాలెస్ ను ఉపయోగించుకోవాలని భావించిన షర్మిలకు షాక్ తగిలింది. జగన్ అందుకు అంగీకరించలేదు. ఇప్పుడు షర్మిల తో పాటు ఆమె తల్లి విజయమ్మ వెళ్లకుండా ప్యాలెస్ వద్ద భారీగా భారీ కేట్లు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. దీనిపై పోరాటానికి షర్మిల సిద్ధపడుతున్నారు. పాలసీ ఎదుట ధర్నా చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
అప్పటినుంచి వివాదం…
గతంలో షర్మిల కుమార్తె వివాహాన్ని యలహంక ప్యాలెస్ లో నిర్వహించాలని నిర్ణయించడంతో వివాదం మొదలైంది. ఆ ఇంట్లో తాను నివసిస్తున్నందున పెద్ద సంఖ్యలో అతిధులు, ఈవెంట్ సిబ్బంది రాకపోకల వల్ల భద్రత, గోప్యతకు ఇబ్బందులు ఎదురవుతాయని జగన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.. ప్రత్యామ్నాయంగా హైదరాబాదులోని లోటస్ పాండ్ నివాసాన్ని వినియోగించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో యలహంక ఆస్తి పై తనకు, తన పిల్లలకు హక్కు ఉందని షర్మిల వాదిస్తున్నారు. తమ తండ్రి రాజశేఖరరెడ్డి హయాంలో కుటుంబ ఆస్తుల్లో భాగంగా ఆస్తిని తమకు కేటాయించారని షర్మిల చెప్పుకొస్తున్నారు. 2019లో జరిగిన కుటుంబ అవగాహన ఒప్పందాన్ని కూడా తన వాదనకు ఆధారంగా ప్రస్తావిస్తున్నారు. దీంతో ఈ ఆస్తి వివాదం మరింత ముదిరింది.
విజయమ్మ బాధ అంతా ఇంతా కాదు…
అయితే ఇద్దరు పిల్లల మధ్య విజయమ్మ నలిగిపోతున్నారు. అయితే విజయమ్మ సైతం ఆ ఆస్తిలో షర్మిల పిల్లలకు వాటా ఉందని బలంగా చెబుతున్నారు. అయితే ఈ ప్యాలెస్ విషయంలో షర్మిల పట్టుబడుతున్న నేపథ్యంలో జగన్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలు ఉన్నాయని చెబుతూ ఆ ప్యాలెస్ వైపు షర్మిల, విజయమ్మ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు షర్మిల. విజయమ్మ సైతం పూర్తిగా నిర్వేదంతో కనిపించారు. అయితే ఆ ప్యాలెస్ ఎదుట ధర్మ పోరాటానికి షర్మిల దిగనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పవు. అయితే ఈ మొత్తం పరిణామాలతో వైయస్ కుటుంబ అభిమానులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు.
