క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాజకీయాల్లో తనదైన దూకుడు, ఉద్వేగభరిత ప్రసంగాలతో నిత్యం వార్తల్లో నిలిచే కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన మహాపాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ఎంతో భావోద్వేగంతో ప్రసంగించారు.
‘జై శ్రీరామ్’ అంటూ ఎమోషనల్ వ్యాఖ్యలు
సభకు భారీ ఎత్తున తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు, అభిమానులను చూసి బండి సంజయ్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “అన్నా.. మా గుండె లబ్ డబ్.. లబ్ డబ్ అని కొట్టుకోవట్లేదు. కేవలం జై శ్రీరామ్.. జై శ్రీరామ్ అని మాత్రమే కొట్టుకుంటోంది” అంటూ ఎమోషనల్ అయ్యారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయగానే సభా ప్రాంగణం ఒక్కసారిగా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోయింది. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరిసింది.
కరీంనగర్ నా కాషాయ అడ్డా.. కాంగ్రెస్‌కు సవాల్
అనంతరం అధికార కాంగ్రెస్ పార్టీ నేతలపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్ గడ్డపై బీజేపీ బలాన్ని తక్కువ అంచనా వేస్తున్న వారికి ఆయన తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. “కరీంనగర్ నా కాషాయ అడ్డా అని తొడగొట్టి సవాల్ విసరాలని ఉంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇక్కడి ప్రభంజనాన్ని చూడండి
“తెలంగాణలో అసలు బీజేపీ ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతల్లారా.. కరీంనగర్ గడ్డపై కనిపిస్తున్న ఈ జన ప్రభంజనాన్ని ఒకసారి కళ్లు తెరిచి చూడండి” అని సంజయ్ ఘాటుగా హెచ్చరించారు. ప్రజల ఆశీర్వాదం, కార్యకర్తల అండదండలు ఉన్నంత వరకు కరీంనగర్‌లో కాషాయ జెండా రెపరెపలాడుతూనే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.మొత్తానికి, కరీంనగర్ మహాపాదయాత్రలో బండి సంజయ్ చేసిన ఈ పవర్‌ఫుల్ స్పీచ్ బీజేపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపగా, తెలంగాణ రాజకీయాల్లో వేడిని మరింత పెంచింది.
