టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై మరో మెట్టు ఎక్కించేందుకు చిత్రబృందం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
సాంకేతిక నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని అత్యాధునిక పద్ధతుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐమ్యాక్స్, డాల్బీ విజన్‌తో పాటు మొత్తం 18 విభిన్న సాంకేతిక ఫార్మాట్లలో సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అద్భుతమైన థియేటర్ అనుభూతిని అందించాలన్నది చిత్రబృందం లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇక విడుదల తేదీ విషయానికి వస్తే.. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఉగాది పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం సినిమా నిర్మాణ పనులను వేగంగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో మహేశ్ బాబు ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. పురాణ గాథల నేపథ్యానికి టైమ్ ట్రావెల్, సాహసోపేతమైన సంఘటనలను జోడించి రాజమౌళి ఈ కథను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ విజువల్స్, వినూత్న కథాంశం, అత్యాధునిక సాంకేతికతతో ‘వారణాసి’ ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వస్తున్న ‘వారణాసి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
also read: “మా ప్రేమ మాటలకే పరిమితం కాదు”- విజయ్ దేవరకొండపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు..
