క్రైమ్ మిర్రర్, జాతీయం:- తమిళనాడులోని విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో బాధితులకు పరిహారంగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు ఉద్యోగాలు మంజూరు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది.ఈ కేసు విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. “ప్రభుత్వ ఉద్యోగం అనేది ఎవరికీ ఉచితంగా పంచిపెట్టే బహుమతి కాదు” అని కోర్టు స్పష్టం చేసింది. కేవలం సానుభూతితో, నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని పేర్కొంది. సరైన విద్యార్హతలు ఉండి, పోటీ పరీక్షలు లేదా అధికారిక నియామక ప్రక్రియ ద్వారా ఎంపికైన అర్హులకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాలని కోర్టు తేల్చి చెప్పింది.
రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి
బాధిత కుటుంబాలకు అండగా నిలవడాన్ని తప్పుబట్టలేమని, అయితే ఆ సాకుతో ప్రభుత్వ ఉద్యోగాలను ఇష్టానుసారంగా పంచిపెట్టే అధికారం ప్రభుత్వానికి లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ పరిమితులు, నిబంధనలకు లోబడే వ్యవహరించాలని కోర్టు ఈ సందర్భంగా ప్రభుత్వానికి హితవు పలికింది.కోర్టు తాజా తీర్పుతో తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చ మొదలైంది. బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి వారికి భరోసా కల్పించడంతో పాటు, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని భావించిన విజయ్ ప్రభుత్వానికి కోర్టు తీర్పు తీవ్ర నిరాశను మిగిల్చింది. మరి హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బాధితులను ఆదుకుంటుందా అనేది వేచి చూడాలి.
పొలిమేర 3 ఘన ప్రారంభం – అర్జున్ ఎంట్రీతో మరింత పెరిగిన అంచనాలు!
