క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: మే 1, 2026 కార్మికుల దినోత్సవం (మేడే) సందర్భంగా తెలంగాణ ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల చట్టం – 2026 అమల్లోకి వచ్చింది. రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఈ చారిత్రాత్మక బిల్లుకు ఆమోదముద్ర వేశారు. దీని ద్వారా రాష్ట్రంలోని సుమారు 4.5 లక్షల మంది ఓలా, ఉబెర్, జొమాటో, స్విగ్గీ వంటి సంస్థల్లో పని చేసే డెలివరీ భాగస్వాములు, క్యాబ్ డ్రైవర్లకు చట్టపరమైన రక్షణ మరియు సామాజిక భద్రత లభించనుంది.
గిగ్ వర్కర్ల సమస్యల పరిష్కారం, సంక్షేమం పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక ‘సామాజిక భద్రత, సంక్షేమ బోర్డు’ ఏర్పాటు కానుంది. చట్టం కింద నమోదు చేసుకునే ప్రతి గిగ్ కార్మికుడికి ప్రభుత్వం ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తుంది.సామాజిక భద్రత: ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, గ్రాట్యుటీ, పెన్షన్ మరియు ప్రసూతి ప్రయోజనాలు కల్పించబడతాయి.
ప్లాట్‌ఫామ్ కంపెనీలు (అగ్రిగేటర్లు) తమ ప్రతి లావాదేవీ నుండి 1% నుండి 2% మొత్తాన్ని ఈ సంక్షేమ నిధికి జమ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి సరైన కారణాలు లేకుండా కంపెనీలు కార్మికులను ఏకపక్షంగా తొలగించడం లేదా వారి ఐడీలను బ్లాక్ చేయడం కుదరదు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రత్యేక అధికారులతో కూడిన ప్లాట్‌ఫామ్-స్థాయి కమిటీలు ఏర్పాటవుతాయి.ఈ కొత్త చట్టం వల్ల గిగ్ వర్కర్లు అసంఘటిత కార్మికులుగా కాకుండా ప్రభుత్వం గుర్తించిన ప్రత్యేక శ్రామిక వర్గంగా చట్టబద్ధమైన హక్కులను పొందుతున్నారు.