- గజపతినగరం హాస్పిటల్ ఘన విజయం
- తొలిసారిగా సక్సెస్ ఫుల్ గా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా గజపతినగరం ఏరియా ఆసుపత్రి వైద్య రంగంలో విశేష ఘనత సాధించింది. సాధారణంగా భారీ ఖర్చులతో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే జరిగే మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిలో విజయవంతంగా నిర్వహించడం స్థానికంగా ఆనందాన్ని కలిగిస్తోంది.
గత పదేళ్లుగా తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ నడవలేని పరిస్థితికి చేరుకున్న 70 ఏళ్ల వృద్ధుడు చికిత్స కోసం అనేక చోట్ల తిరిగినా, అధిక ఖర్చుల కారణంగా శస్త్రచికిత్స చేయించుకోలేకపోయాడు. చివరకు గజపతినగరం ఏరియా ఆసుపత్రిని ఆశ్రయించగా, అక్కడి వైద్యులు ఈ క్లిష్టమైన ఆపరేషన్‌ను సవాల్ గా స్వీకరించారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్, అనస్థీషియా నిపుణుడు డా. జగదీష్ పర్యవేక్షణలో, ఆర్థోపెడిక్ నిపుణుడు డా. బెజవాడ సతీష్ కుమార్ నేతృత్వంలో వైద్య బృందం సమన్వయంతో శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది.
అనస్థీషియా వైద్యులు డా. సాయికుమార్, డా. దివ్యలు ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉండగా, త్వరలోనే సాధారణ జీవనానికి తిరిగి చేరుకునే అవకాశముందని వైద్యులు తెలిపారు.
ఈ శస్త్రచికిత్సలో రోగి కేవలం ఇంప్లాంట్ ఖర్చును మాత్రమే భరించగా, మిగిలిన అన్ని సేవలను ప్రభుత్వం ఉచితంగా అందించడం విశేషం. శస్త్రచికిత్స, మందులు, ఆపరేషన్ థియేటర్, ఆసుపత్రి వసతులు అన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించబడ్డాయి. ఈ చర్యతో పేదలకు కూడా అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యం ప్రతిఫలించింది.
భారత్‌లో ఇప్పటివరకు ఇలాంటి మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు ప్రధానంగా న్యూఢిల్లీ AIIMS, హైదరాబాద్ NIMS, చెన్నై అపోలో ఆసుపత్రులు, ముంబై KEM హాస్పిటల్, బెంగళూరు సెంట్ జాన్స్ ఆసుపత్రుల్లో ఎక్కువగా జరిగేవి. అయితే ఇప్పుడు జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ సేవలు అందుబాటులోకి రావడం వైద్య రంగంలో కీలకమైన మార్పుగా భావిస్తున్నారు.
వైద్యులు మాట్లాడుతూ, కార్పొరేట్ స్థాయి సేవలను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. అలాగే మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలకు అవసరమైన ఇంప్లాంట్ల ఖర్చును భరించేందుకు దాతలు ముందుకు వస్తే, ఆర్థికంగా వెనుకబడిన రోగులకు పూర్తిగా ఉచితంగా ఈ సేవలను అందించగలమని పిలుపునిచ్చారు.
also read: కనులవిందుగా పులుల సందడి: అమ్రాబాద్ అటవుల్లో పెరుగుతున్న పెద్ద పులుల సంఖ్య