క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో జరిగిన విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య తనూజ (55) హత్య కేసులో నేపాలీ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ ఇంట్లో గత ఎనిమిది నెలలుగా పని చేస్తున్న నేపాల్‌కు చెందిన కల్పన అనే పని మనిషి ఈ హత్యలో ప్రధాన సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
మే 7, 2026 (గురువారం) అర్ధరాత్రి దాటాక సుమారు ఒంటి గంట సమయంలో కల్పన తన ముగ్గురు అనుచరులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. వినయ్ రంజన్ రాయ్ బెంగళూరు వెళ్లడంతో తనూజ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి నిందితులు లోపలికి ప్రవేశించారు. ఇది కేవలం దొంగతనం కోసం చేసిన హత్యగా (Murder for Gain) పోలీసులు భావిస్తున్నారు. నిందితులు తనూజ నోట్లో గుడ్డలు కుక్కి, ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు పోలీసులు తెలిపారు.
హత్య అనంతరం భారీగా బంగారం, నగదు దోచుకుని పరారయ్యారు. నిందితులు హత్య తర్వాత ఆటోలో నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లి, అక్కడి నుండి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్లు సిసిటివి ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం లక్నో, ముంబై మరియు నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు 10 ప్రత్యేక బృందాలను పంపినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తెలిపారు. నేపాలీ పని మనుషులను ఉంచుకునే వారు వారి వివరాలను పోలీసులకు సమర్పించి, వెరిఫికేషన్ చేయించుకోవాలని పోలీసులు ఈ సందర్భంగా సూచించారు.