-
సినీ నటుడు ఆలీ షాకింగ్ కామెంట్స్
-
టిడిపి, వైసిపి పై పరోక్ష వ్యాఖ్యలు
-
మండిపడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
క్రైమ్ మిర్రర్, సినీ డెస్క్: ప్రముఖ సినీ నటుడు, కమెడియన్ అలీపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత అలీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తనకు ఏ రాజకీయ పార్టీతో సైతం సంబంధం లేదని తేల్చేశారు.
అయితే తాజాగా తాను ఎందుకు రాజకీయాలకు దూరమయ్యాను? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అనే దాని గురించి వివరణ ఇచ్చారు. అయితే ఎక్కడ రాజకీయ పార్టీల పేర్లు చెప్పలేదు. కానీ ఆలీ పనిచేసింది తెలుగుదేశం పార్టీతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే.
-
తొలుత టిడిపిలో..
1999లో అలీ తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు వరకు ఆ పార్టీలోనే పనిచేశారు. అయితే అప్పట్లో తనకు కండువా వేసారని.. ప్రతి ఐదేళ్లకు వచ్చే ఎన్నికల ప్రచారంలో మాత్రమే తన సేవలను వినియోగించేవారని.. కానీ తనకు ఎటువంటి ప్రయోజనము లేకుండా పోయేదని.. పైగా విలువైన సినిమా సమయాన్ని కూడా రాజకీయాలకు కేటాయించాల్సి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ ఎక్కడ పార్టీ ప్రస్తావన తీసుకురాలేదు. తర్వాత మరో పార్టీలో చేరానని.. పరోక్షంగా వైసిపి ప్రస్తావన తీసుకొచ్చారు. ఐదేళ్లపాటు ఆ పార్టీలో కొనసాగితే అదే పరిస్థితి ఉందని.. అందుకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు తేల్చేశారు. తాను ఇక సినిమాల్లోనే కొనసాగుతానని.. రాజకీయాల్లోకి వెళ్లే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
-
సోషల్ మీడియాలో వైరల్..
ఆలీ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి ఇచ్చిన విషయాన్ని ఎక్కువ మంది గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి అలీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసిపిలోకి చేరినట్లు ప్రచారం నడిచింది. 2019 ఎన్నికలకు రోజుల వ్యవధి ముందు ఆయన వైసీపీలో చేరారు.
ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు. వైసిపి అధికారంలోకి రావడంతో రాజ్యసభ పదవి కానీ.. ఎమ్మెల్సీ పదవి కానీ.. వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి కానీ ఇస్తారని ఆశించారు. కానీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవితో సరిపెట్టుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేస్తారని ప్రచారం సాగింది. కానీ ఆ అవకాశం దక్కలేదు.
మరోవైపు ఎన్నికల ప్రచారంలో సైతం చురుగ్గా పాల్గొనలేదు. వైసిపి ఓడిపోయిన తర్వాత.. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయితే టిడిపిలో పదవి ఇవ్వలేదు కానీ.. వైసిపి హయాంలో కీలకమైన నామినేటెడ్ పదవి దక్కించుకున్న ఆలీ అలా మాట్లాడడం సరికాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.
