హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్.. సోషల్ మీడియాలో జరుగుతున్న మరో మోసంపై యువతను అప్రమత్తం చేశారు. రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల పేరుతో నెట్టింట జరుగుతున్న ప్రచారం వెనుక ఉన్న మోసాలను వివరిస్తూ అమ్మాయిలు, యువతులను అలర్ట్ చేశారు. ఆకర్షణీయమైన కుర్రాళ్ల ఫోటోలు పెట్టి, అమ్మాయిలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇలాంటి కేటుగాళ్ల వలలో పడొద్దంటూ హెచ్చరించారు. ఇలాంటి మోసాలను గమనిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు.సోషల్ మీడియాలో జరిగే మోసాల నుంచి సైబర్ నేరాల వరకూ ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. ముఖ్యంగా యువతీ, యువకులు మోసాలకు గురికాకుండా సోషల్ మీడియా ద్వారావారిని అలర్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే రెంట్ బాయ్‌ఫ్రెండ్ పేరుతో నెట్టింట జరుగుతున్న మోసాలపై మరోసారి యువతను అప్రమత్తం చేశారాయన. ఆగస్ట్ నెలలో రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు వల వేసేందుకు సిద్ధంగా ఉన్నారని.. అలర్ట్‌గా ఉండాలని అమ్మాయిలకు సూచించారు.
Also Read:ఐదేళ్ల ఎదురుచూపులకు తెర.. వరుణ్ తేజ్ విజయంపై నాగబాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్
ఒంటరితనంతో బాధపడుతున్నారా? మీతో కాఫీ తాగడానికి, సినిమాకెళ్లడానికి అందమైన అబ్బాయి కావాలా? అది కూడా 50 శాతం ఆఫర్లతో అంటూ సోషల్ మీడియాలో కలర్‌ఫుల్‌గా కనిపించే పోస్టర్ల వెనుక సైబర్ మోసం దాగి ఉందని.. అమ్మాయిలు, యువతులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు విసురుతున్న కొత్త డేటింగ్ ట్రాప్ ఇదంటూ సజ్జనార్ హెచ్చరించారు. ఫేస్ బుక్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లోఆకర్షణీయంగా ఉండే అబ్బాయిల ఫోటోలను చూపిస్తూ.. కాఫీ మీటింగ్, సినిమా డేట్, షాపింగ్, ఈవెంట్లు, పెళ్లిళ్లు, ఫుల్ డే ప్యాకేజీ అంటూ కేటుగాళ్లు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. గోప్యత, భద్రత పాటిస్తామని, అక్రమ వ్యాపారం కాదని నమ్మబలుకుతూ బుకింగ్స్ కోసం డైరెక్ట్ మెసేజ్ చేయాలని కోరుతూ నెట్టింట ప్రచారం చేస్తున్నారని సజ్జనార్ వివరించారు.”ఏఐతో సృష్టించిన, ఇంటర్నెట్ నుంచి సేకరించిన అందమైన కుర్రాళ్ల ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టి, మెసేజ్ చేసిన అమ్మాయిలతో తియ్యటి మాటలతో సంభాషణలు మొదలుపెడతారు.
Also Read:లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ అనుమానాస్పద మృతి
బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ అమౌంట్ పేరుతో డిజిటల్ వ్యాలెట్లు, క్యూఆర్ కోడ్ల ద్వారా వేలాది రూపాయలు వసూలు చేసి, ఆపై అకౌంట్లను బ్లాక్ చేస్తారు. ఆన్‌లైన్ సంభాషణలు నమ్మి అపరిచిత వ్యక్తులను నేరుగా కలవడానికి వెళ్తే వారు మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేసే ప్రమాదం ఉంది. ప్రేమ పేరుతో అబద్ధాలు చెప్పి మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాటింగ్ క్రమంలో చాకచక్యంగా సేకరించిన ఫోన్ నంబర్లు, వ్యక్తిగత ఫోటోల ఆధారంగా ఆ తర్వాత బెదిరింపులకు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం ఉంది.” అని సజ్జనార్ యువతులు, అమ్మాయిలను అప్రమత్తం చేశారు.సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రకమైన మోసపూరిత ప్రకటనలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం దృష్టిసారించిందని.. వీటికి బాధ్యులైన వారిపై వేగంగా దర్యాప్తు చేసి.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు.
Also Read:కళ్లముందే ఫోన్ చోరీ.. ధైర్యంగా దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించిన కవలలు
ఈ విషయంలో అమ్మాయిలతో పాటుగా, వారి తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. తమ పిల్లలు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? బయట ఎవరిని కలుస్తున్నారు? అనే అంశాలపై తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సూచించారు.సోషల్ మీడియాలో ఇలాంటి కేటుగాళ్లు ఇచ్చే డిస్కౌంట్ ఆఫర్లను చూసి మోసపోవద్దని.. అపరిచిత వ్యక్తులతో చాటింగ్, కలవడం కానీ చేయవద్దని సూచించారు. ఎవరైనా ఇలాంటి సైబర్ కేటుగాళ్ల బారినపడినా, లేదా అనుమానాస్పద పోస్టులు గమనిస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కి కాల్ చేయాలని.. లేదంటే cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు.
