కొడుకు మరణంతో ఒంటరిగా మిగిలిన కోడలి భవిష్యత్తు గురించి ఆలోచించిన ఓ అత్త కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు చిన్నారులతో ఉన్న కోడలికి మరో వివాహం జరిపించి.. ఆమె జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన మీనాక్షికి సుమారు పదేళ్ల క్రితం ముజఫర్‌నగర్ జిల్లాకు చెందిన రోహిత్‌తో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఏడేళ్ల రితూ, ఏడాదిన్నర వయసున్న అవిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా కుటుంబం సంతోషంగా జీవిస్తోంది. అయితే వరుస విషాదాలు ఆ కుటుంబాన్ని తీవ్రంగా కుదిపేశాయి.
మేస్త్రీగా పనిచేసే రోహిత్ తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతూ ఆగస్టు 14న మృతి చెందాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోయిన రోహిత్ కూడా మరుసటి రోజే అంటే ఆగస్టు 15న కన్నుమూశాడు. దీంతో మీనాక్షి తన ఇద్దరు చిన్నారులతో ఒంటరిగా మిగిలింది.
ఈ పరిస్థితుల్లో కోడలి భవిష్యత్తు గురించి రోహిత్ తల్లి సునీత ఆలోచించింది. ఇద్దరు పిల్లలతో మీనాక్షి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మరో వివాహం చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ముందుగా మీనాక్షితో పాటు ఆమె కుటుంబ సభ్యులతో చర్చించింది. అందరి అంగీకారంతో సంబంధం కోసం ప్రయత్నాలు చేసింది.
ఈ క్రమంలో రాజస్థాన్‌లోని నారాయణపూర్‌కు చెందిన చాట్ విక్రేత యోగేష్‌తో మీనాక్షికి వివాహం కుదిరింది. సెప్టెంబర్ 23న స్థానిక ఆర్య సమాజ్ ఆలయంలో వీరి వివాహం జరిగింది. ఈ పెళ్లిలో మీనాక్షి మరిది మోహిత్ ప్రత్యేక పాత్ర పోషించాడు. సోదరుడిగా ఆమెకు అండగా నిలిచి కన్యాదానం కార్యక్రమాన్ని నిర్వహించాడు.
అత్త సునీత కూడా వివాహ వేడుకలో సంప్రదాయ బాధ్యతలను నిర్వర్తించింది. కోడలికి కొత్త జీవితం ప్రారంభమవుతుండటంపై ఆమె ఆనందం వ్యక్తం చేసింది. మీనాక్షి కొత్త కుటుంబంలోకి వెళ్లినప్పటికీ ఆమెతో తమ బంధం కొనసాగుతుందని సునీత, మోహిత్ తెలిపారు.
మరోవైపు కొత్త జీవితాన్ని ప్రారంభించడంపై మీనాక్షి కూడా సంతోషంగా కనిపించింది. వివాహానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
also read: రిషబ్ శెట్టి సినిమాలో ఛాన్స్.. కొత్త నటీనటులకు ఓపెన్ కాస్టింగ్ కాల్
