ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. సాంకేతికతను హస్తకళలతో అనుసంధానిస్తూ, దేశంలో తొలిసారిగా హస్తకళా ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనలతో ‘లేపాక్షి’ సంస్థ ఆధ్వర్యంలో ఈ డిజిటల్ వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చారు.
ఇకపై హస్తకళా ఉత్పత్తులపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే, ఆ కళాఖండానికి సంబంధించిన పూర్తి వివరాలు వినియోగదారులకు వెంటనే అందుబాటులోకి వస్తాయి. ఆ ఉత్పత్తి చరిత్ర, సాంస్కృతిక ప్రాముఖ్యత, తయారు చేసిన కళాకారుడి వివరాలు, అతని నైపుణ్యం, తయారీ ప్రక్రియ వంటి అంశాలు ఇందులో పొందుపరిచారు.
అదేవిధంగా, ముడిసరుకు వివరాలు, తయారీకి పట్టిన సమయం, ఉత్పత్తి కొలతలు వంటి సాంకేతిక సమాచారం కూడా క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకునే సౌకర్యం కల్పించారు. జీఐ ట్యాగ్‌కు సంబంధించిన వివరాలు, ‘ఒక జిల్లా – ఒక ఉత్పత్తి’ పథకం సమాచారం కూడా ఇందులో భాగంగా అందుబాటులో ఉంటుంది.
మొదటి దశలో రాష్ట్రంలోని ఎనిమిది ప్రాధాన్యత కలిగిన హస్తకళా ఉత్పత్తులకు ఈ వ్యవస్థను అమలు చేస్తున్నారు. బొబ్బిలి వీణ, కలంకారి చిత్రాలు, సవర గిరిజన పెయింటింగ్స్ వంటి ప్రసిద్ధ కళాఖండాలకు డిజిటల్ ప్రొఫైల్స్ సిద్ధం చేశారు.
భవిష్యత్తులో రాష్ట్రంలోని అన్ని హస్తకళా ఉత్పత్తులకు ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ చర్యతో నకిలీ ఉత్పత్తులను నియంత్రించడంతో పాటు, అసలు కళాకారులకు సరైన గుర్తింపు దక్కే అవకాశం ఉంది.
ప్రపంచ మార్కెట్‌లో ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు మరింత గుర్తింపు తెచ్చే దిశగా ఈ డిజిటల్ ముందడుగు ఉపయోగపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ విధానం ద్వారా కళాకారులకు మెరుగైన ఆదాయం, వినియోగదారులకు నమ్మకమైన సమాచారం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది.
also read: మహారాష్ట్రలో అనలాగ్ పనీర్‌కు బ్రేక్.. ఏడాది నిషేధం, కఠిన శిక్షలు అమలు
