క్రైమ్ మిర్రర్ : ప్రధాని నరేంద్ర మోదీతో ఓ మహిళ ఉన్నట్లుగా రూపొందించిన ఏఐ మార్ఫింగ్ ఫొటో వ్యవహారం ఢిల్లీ హైకోర్టుకు చేరింది. తన ఫొటోను అనుమతి లేకుండా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారంటూ బాధిత మహిళ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. సంబంధిత ఫొటో, పోస్టులను తొలగించాలని సోషల్ మీడియా సంస్థ మెటాను ఆదేశించింది.
ఇటీవల సీజేపీకి చెందిన కొందరు నేతలు ప్రధాని మోదీతో ఓ మహిళ ఉన్నట్లుగా కనిపించే మార్ఫింగ్ చేసిన ఫొటోను సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తన ఫొటోను కృత్రిమ మేధస్సు సాయంతో మార్చి ఈ విధంగా ఉపయోగించారని బాధిత మహిళ కోర్టుకు తెలిపింది. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పిటిషన్‌లో కోరింది.
ఈ పిటిషన్‌పై జస్టిస్ గిరీష్ కత్పాలియా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారం సాధారణమైనది కాదని కోర్టు పేర్కొంది. ఒక సాధారణ మహిళ చిత్రాన్ని దేశ ప్రధానితో ఉన్నట్లుగా మార్చి ప్రచారం చేయడం తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో సీజేపీతో పాటు ఆ సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, నేతలు అశుతోష్ రాంకా, రత్నా సింగ్‌లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. సంబంధిత ఫొటోతో పాటు దానికి సంబంధించిన అన్ని పోస్టులను తొలగించాలని మెటాను ఆదేశించింది. ఇతర వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్న ఆ ఫొటోలను కూడా తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మహిళకు రక్షణ కల్పించాలని కూడా ఢిల్లీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన చిత్రాల ప్రచారం, వాటి మూలాలు, సంబంధిత వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.
also read : చండీగఢ్‌లో హెడ్ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి.. కొడుకుపై అనుమానాలు
