క్రైమ్ మిర్రర్ : చండీగఢ్‌లో ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపింది. ఇంట్లోనే తుపాకీ కాల్పులకు గురై ఆయన ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటన వెనుక ఆయన మైనర్ కుమారుడి ప్రమేయం ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నితిన్ అనే హెడ్ కానిస్టేబుల్ చండీగఢ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని అకౌంట్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. సెక్టార్ 22లోని ఆయన నివాసంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం సమయంలో ఇంటి నుంచి కాల్పుల శబ్దం వినిపించడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే నితిన్ భార్య, ఆయన కుమారుడు ఇంట్లోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నితిన్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన స్థితిలో కనిపించగా.. అనంతరం ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనాస్థలంలో పోలీసులు ఓ దేశీ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆయుధం నుంచి వెలువడిన బుల్లెట్ తగలడం వల్లే నితిన్ మృతి చెందినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఈ ఘటనపై చండీగఢ్ ఎస్ఎస్పీ కన్వర్దీప్ కౌర్ స్వయంగా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్ ఆధారాలతో పాటు ఇతర కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. కాల్పులు ప్రమాదవశాత్తు జరిగాయా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాథమిక విచారణలో నితిన్ మైనర్ కుమారుడి ప్రమేయం ఉండొచ్చన్న అనుమానం వ్యక్తమైనప్పటికీ.. ఇప్పుడే ఎలాంటి నిర్ధారణకు రాలేమని పోలీసులు స్పష్టం చేశారు. ఘటనకు ముందు ఇంట్లో ఏం జరిగింది, కాల్పులు ఎలా జరిగాయి, తుపాకీ ఎవరి వద్ద ఉందనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ, ఆధారాల పరిశీలన అనంతరం మాత్రమే నితిన్ మృతికి అసలు కారణం, కాల్పులకు బాధ్యులు ఎవరు అనే విషయం స్పష్టమవుతుందని పోలీసులు తెలిపారు.
also read : వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు.. సునీల్ యాదవ్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు
