నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న క్రమంలో నటుడు సంపూర్ణేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగేంద్ర కుమార్ నిర్వహించిన ఇంటర్వ్యూలో సంపూర్ణేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరోగా ఇండస్ట్రీలోకి రావడంపై ప్రశ్నిస్తూ.. ఆయన రూపాన్ని ప్రస్తావిస్తూ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
“అసలు ఈ ఫేస్‌తో హీరో అవుదామని ఇండస్ట్రీలోకి ఎలా వచ్చావు?” అంటూ సంపూర్ణేష్ బాబును ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలపై ఆయన అభిమానులు, పలువురు నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఒక నటుడిని ఇంటర్వ్యూ చేసే సమయంలో వ్యక్తిగత రూపాన్ని ప్రస్తావిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు రావడంతో జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ స్పందించారు. తన వ్యాఖ్యల వల్ల సంపూర్ణేష్ బాబు మనస్తాపానికి గురై ఉంటే, ఆయనకు, ఆయన అభిమానులకు బహిరంగంగా క్షమాపణలు తెలుపుతున్నాను అని చెప్పారు. తన వ్యాఖ్యల ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పకుండా, జరిగిన పరిణామంపై విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇక సంపూర్ణేష్ బాబు విషయంలో గతంలోనూ ఆయన సినిమాలు, నటనపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల కారణంగా వివాదం తలెత్తడం, అనంతరం జర్నలిస్ట్ క్షమాపణలు చెప్పడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
also read: జార్ఖండ్ లో భారీ బ్యాంకు దోపిడీ.. రూ.36 కోట్ల బంగారం, రూ.43 లక్షల నగదు అపహరణ
