హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ సాహసోపేతంగా నిర్వహించిన ఆపరేషన్ చర్చనీయాంశంగా మారింది. కేపీహెచ్‌బీ ప్రాంతంలోని ఓ పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో ఆమె స్వయంగా రంగంలోకి దిగారు. స్పై కెమెరాలు ధరించి మఫ్టీలో అర్ధరాత్రి ఒంటరిగా పబ్‌కు వెళ్లిన డీసీపీ, అక్కడ జరుగుతున్న వ్యవహారాలను గమనించారు. పబ్ లో యువతులతో అసభ్యకర నృత్యాలు చేయించడం, కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఇతర నగరాల నుంచి యువతులను తీసుకువచ్చి కస్టమర్లతో మమేకం చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కూడా అనుమానించారు.
పబ్ మేనేజర్ సహా పలువురి అరెస్ట్
పబ్‌లో జరిగిన వ్యవహారాలను ఫొటోలు, వీడియోల రూపంలో రికార్డు చేసిన డీసీపీ వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులు పబ్‌పై దాడి నిర్వహించారు. ఈ దాడిలో పబ్ మేనేజర్‌ను అరెస్టు చేయడంతో పాటు నలుగురు యువతులు, నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
పబ్ లో మోసాలపై ఫిర్యాదులు
విచారణలో కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులను ఉపయోగించి ఖరీదైన మద్యం కొనుగోలు చేయించే విధానం అమలులో ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో కస్టమర్లకు భారీ బిల్లులు పడుతున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే పబ్‌కు సంబంధించిన మరో ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతి పబ్ లో కలుద్దామని చెప్పడంతో అతడు అక్కడికి వెళ్లాడు. కొద్దిసేపు గడిపిన తర్వాత అతనికి రూ.41 వేలకుపైగా బిల్లు ఇవ్వడంతో షాక్ కు గురయ్యాడు. తనతో వచ్చిన యువతి కనిపించకపోవడంతో మోసపోయినట్లు భావించి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
పట్టించుకోని స్థానిక పోలీసులు
అయితే ఇలాంటి ఘటనలపై గతంలో వచ్చిన ఫిర్యాదులను స్థానిక పోలీసులు పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. పబ్‌లో జరుగుతున్న కార్యకలాపాలపై ముందే సమాచారం ఉన్నప్పటికీ చర్యలు తీసుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీసీపీ స్వయంగా రంగంలోకి దిగి నిర్వహించిన ఆపరేషన్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.