Homeతెలంగాణ"30 వేల అడుగుల ఎత్తులో షాక్.. ఒకేసారి ముగ్గురు పైలట్లకు అస్వస్థత!"

“30 వేల అడుగుల ఎత్తులో షాక్.. ఒకేసారి ముగ్గురు పైలట్లకు అస్వస్థత!”

క్రైం మిర్రర్ : హైదరాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ప్రయాణ మధ్యలో విమానాన్ని నడుపుతున్న ముగ్గురు పైలట్లు అస్వస్థతకు గురికావడంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది అవసరమైన చర్యలు చేపట్టారు. వారిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో విమానం లండన్ చేరుకున్న వెంటనే వైద్య చికిత్స అందించారు.

సమాచారం ప్రకారం, బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన BA276 విమానం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ హీత్రూ విమానాశ్రయానికి బయలుదేరింది. ప్రయాణ సమయంలో సుమారు 30 వేల అడుగుల ఎత్తులో విమానం ఎగురుతున్న సమయంలో ఒక పైలట్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో విమానంలోనే ఆయనకు ప్రాథమిక వైద్యం, ఆక్సిజన్ అందించారు. ఈ విషయాన్ని ముందుగానే హీత్రూ విమానాశ్రయ అధికారులకు తెలియజేయడంతో విమానం ల్యాండ్ అయిన వెంటనే వైద్య బృందం సిద్ధంగా ఉండి చికిత్స అందించింది. ఇతర ఇద్దరు పైలట్లకు కూడా ప్రయాణ సమయంలో అస్వస్థత లక్షణాలు కనిపించినప్పటికీ, వారు విమాన నిర్వహణను కొనసాగించినట్లు సమాచారం. అయినప్పటికీ ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని బ్రిటిష్ ఎయిర్‌వేస్ స్పష్టం చేసింది.

ఈ ఘటనపై సంస్థ అంతర్గత విచారణ ప్రారంభించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానం బయలుదేరే ముందు ముగ్గురు పైలట్లు హైదరాబాద్‌లో బస చేసిన హోటల్‌లో అల్పాహారం చేసినట్లు తెలుస్తోంది. అలాగే బయటి సరఫరాదారు అందించిన ప్యాకేజ్డ్ తాగునీటిని కూడా వినియోగించినట్లు సమాచారం. దీంతో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఈ ఘటన జరిగి ఉండొచ్చనే కోణంలో విచారణ కొనసాగుతోంది. అయితే అస్వస్థతకు అసలు కారణం ఇంకా నిర్ధారణ కాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటన అనంతరం హైదరాబాద్ స్టాప్‌ఓవర్ సందర్భంగా సిబ్బందికి కల్పిస్తున్న హోటల్, క్యాటరింగ్ ఏర్పాట్లను బ్రిటిష్ ఎయిర్‌వేస్ సమీక్షిస్తోంది. అవసరమైతే భవిష్యత్తులో వాటిలో మార్పులు చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
also read : ఖమ్మంలో ముదురుతున్న రాజకీయ వివాదం…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు