క్రైం మిర్రర్ : అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు రాష్ట్ర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గత 24 గంటల్లో వరదలకు సంబంధించిన ఘటనల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఈ ఏడాది వరదల కారణంగా మృతుల సంఖ్య 41కు చేరింది. అధికారుల వివరాల ప్రకారం, శివసాగర్, జోర్హాట్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, చరైడియో జిల్లాలో ఇద్దరు, కర్బీ అంగ్లాంగ్, ధేమాజీ జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 జిల్లాలు వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. శివసాగర్, చరైడియో, ధేమాజీ, దిబ్రూఘర్, గోలాఘాట్, హోజాయ్, జోర్హాట్, కమ్రూప్, కమ్రూప్ మెట్రోపాలిటన్, కర్బీ అంగ్లాంగ్, నాగావ్ జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 6.53 లక్షల మందికి పైగా వరదల ప్రభావానికి గురయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 939 గ్రామాలు నీటమునిగాయి. దాదాపు 24,897 హెక్టార్ల వ్యవసాయ భూమి దెబ్బతినగా, పంటలకు భారీ నష్టం వాటిల్లింది. బాధితుల కోసం 10 జిల్లాల్లో 487 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసిన అధికారులు, 24 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని పలు నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. ఖోవాంగ్ ప్రాంతంలోని బురీదిహింగ్, శివసాగర్‌లోని దిఖౌ, నుమాలిగఢ్‌లోని ధన్‌సిరి, శ్రీభూమిలోని కుషియారా నదుల నీటిమట్టం గణనీయంగా పెరిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.
వరద పరిస్థితులపై అస్సాం ముఖ్య కార్యదర్శి రవి కోట సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని, అవసరమైన చోట్ల అదనపు సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రహదారులు, విద్యుత్, తాగునీటి వంటి మౌలిక వసతుల పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు.
also read : డీజీపీ కార్యాలయంలో షాకింగ్ ఘటన…! సర్వీస్ తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య…