-
పొలిటికల్ రీ ఎంట్రీకి తోట చంద్రశేఖర్ సిద్ధం
-
మొన్నటి ఎన్నికలకు ముందు ఏపీ బాధ్యతలు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. చాలామంది నేతలు తమ రాజకీయ భవిష్యత్తు వెతుక్కుంటూ వివిధ పార్టీల్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తన రాజకీయ భవిష్యత్తు కోసం వ్యూహరచన సిద్ధం చేస్తున్నారు. ఏదో ఒక పార్టీలో చేరేందుకు ఆయన గట్టి ప్రయత్నం లోనే ఉన్నారు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కానీ.. భారతీయ జనతా పార్టీలో కానీ చేరేందుకు ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. జనసేనలో ఉండే తోట చంద్రశేఖర్ను పిలిచి మరి కెసిఆర్ బిఆర్ఎస్ ఏపీ భాధ్యతలను అప్పగించారు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, తరువాత సార్వత్రిక ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీ ఉనికి ఏపీలో లేకుండా పోయింది.
ప్రజారాజ్యం ద్వారా ఎంట్రీ…
Also Read:ఖమ్మంలో ముదురుతున్న రాజకీయ వివాదం…!
ప్రజారాజ్యం పార్టీలో చాలా యాక్టివ్ గా పని చేశారు తోట చంద్రశేఖర్. అందుకే కొద్ది రోజుల కిందట మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అయితే జనసేనలో తిరిగి చెరేందుకు మెగాస్టార్ సాయం తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. కానీ జనసేన నుంచి ఆయనకు సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సొంత మీడియాలో కూడా జనసేనకు వ్యతిరేకంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో.. బిజెపిలో కానీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కానీ చేరుతారని తెలుస్తోంది.
దాదాపు అన్ని పార్టీల్లో…
Also Read:బీజేపీ బెంగాల్ వ్యూహం…!
కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ పూర్వాశ్రమంలో ఐఎఫ్ఎస్ అధికారిగా పనిచేశారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారిగా మంచి గుర్తింపు సాధించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరారు. తర్వాత జగన్ వైసీపీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో కూడా చేరారు. జనసేన పార్టీలో కూడా చేరి సేవలందించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయారు. మొన్నటి ఎన్నికలకు ముందు కేసీఆర్ పిలుపుతో భారత రాష్ట్ర సమితి ఏపీ బాధ్యతలను తీసుకున్నారు. ఆ పార్టీ దారుణంగా ఓడిపోవడంతో తోట చంద్రశేఖర్ రాజకీయ భవితవ్యం లేకుండా పోయింది.
వైసిపి వైపే ఛాన్స్…
Also Read:వైరల్ లేఖపై క్లారిటీ: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్త పూర్తిగా ఫేక్!
ప్రస్తుతం కాపు సామాజిక వర్గాన్ని అస్త్రంగా మార్చుకొని కూటమిపై పోరాటం చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి సమయంలో తోట చంద్రశేఖర్ వస్తామంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వద్దనదు. గుంటూరు జిల్లాలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని తోట చంద్రశేఖర్ భావిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి హామీ లభిస్తే ఆ పార్టీలో చేరిక కు ముహూర్తం నిర్ణయిస్తారని తెలుస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో బలమైన నేతగా ఉన్నారు చంద్రశేఖర్. సామాజిక వర్గ పరంగా, ఆర్థికంగా బలమైన నేత కావడంతో ఆయన చేరికకు పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ఇప్పటికే వైసీపీ సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే తరచూ పార్టీలు మారడం ద్వారా పొలిటికల్ డామేజ్ జరిగింది. అందుకే ఈసారి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని తోట చంద్రశేఖర్ భావిస్తున్నారు.