ముంబైలో ఓ స్టాండప్ కామెడీ షోలో పాల్గొన్న మహిళా డాక్టర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. వైద్య విద్యలో శిక్షణ కోసం ఉపయోగించే మృతదేహాల (కడావర్స్) గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయంటూ నెటిజన్లు, వైద్య వర్గాలు తీవ్రంగా స్పందించాయి.
సమాచారం ప్రకారం, ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో వైద్య విద్య పూర్తి చేసిన డాక్టర్ సెజల్ పవార్ ఇటీవల ఓ కామెడీ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా షోలో అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, అనాటమీ క్లాసుల్లో మృతదేహాలను చూసినప్పుడు తాము సరదాగా కొన్ని విషయాలు మాట్లాడుకునేవాళ్లమని తెలిపారు. ముఖ్యంగా పురుష మృతదేహాల ప్రైవేట్ భాగాల గురించి సరదాగా చర్చించేవాళ్లమని నవ్వుతూ చెప్పడం వివాదానికి కారణమైంది.

ఈ వ్యాఖ్యల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. తమ శరీరాలను వైద్య విద్య కోసం దానం చేసిన వ్యక్తుల పట్ల గౌరవం లేకుండా మాట్లాడటం వైద్య నైతిక విలువలకు విరుద్ధమని పలువురు అభిప్రాయపడ్డారు. అలాగే వైద్య విద్యార్థులు అనుసరించే కడావరిక్ ప్రమాణాన్ని కూడా ఈ వ్యాఖ్యలు అవమానించాయని ఆరోపణలు వచ్చాయి.
వివాదం తీవ్రరూపం దాల్చడంతో, డాక్టర్ సెజల్ పవార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను ఆలోచించకుండా మాట్లాడానని, తన వ్యాఖ్యలు ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమించాలని తెలిపారు. చేసిన తప్పుకు పూర్తి బాధ్యత వహిస్తున్నానని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతానని పేర్కొన్నారు.