జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అనుకోని అతిథి ఎదురైంది. చేపల కోసం వేసిన వలలో ఒక పెద్ద మొసలి చిక్కుకోవడంతో గ్రామంలో కొంతసేపు ఆందోళన వాతావరణం నెలకొంది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, గత రెండు రోజులుగా చెరువులో చేపల వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం వలలను పరిశీలించగా అందులో మొసలి చిక్కుకుని ఉండటాన్ని గమనించారు. మొదట భయాందోళనకు గురైన మత్స్యకారులు, తర్వాత ధైర్యం చేసి స్థానికుల సహాయంతో మొసలిని జాగ్రత్తగా తాళ్లతో కట్టేశారు.
తిమ్మాపూర్ సొసైటీ నెంబర్ నారాయణ నాయుడు, ఇతర మత్స్యకారుల సహకారంతో మొసలిని అదుపులోకి తీసుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు మొసలిని స్వాధీనం చేసుకుని సమీప సహజ వాతావరణంలో విడిచిపెట్టేందుకు చర్యలు చేపట్టారు. గ్రామస్థులు, మత్స్యకారులు సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈ ఘటన ముగిసింది.
సాధారణంగా మొసళ్లు పెద్ద నదులు, సరస్సులు, రిజర్వాయర్లు వంటి నీటి వనరుల్లో నివసిస్తాయి. వర్షాకాలం లేదా నీటి ప్రవాహ మార్పుల కారణంగా ఇవి చెరువులు, కాలువల వైపు చేరే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు, స్వయంగా వాటికి హానిచేయకుండా అటవీ శాఖకు సమాచారం ఇవ్వడం అత్యంత ముఖ్యం.
also read: తొలి వరల్డ్ కప్‌లోనే డబుల్ గోల్డ్… తుర్కియేలో ధీరజ్ బొమ్మదేవర సంచలనం!