హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: న్నికలలో పారదర్శకతను పెంచేందుకు బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్య పహాడ్ గ్రామానికి చెందిన లా కాలేజ్ విద్యార్థి నక్క శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు సమర్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ, ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో డూప్లికేట్ ఓటింగ్, బోగస్ ఓటింగ్, ఇతరుల పేర్లతో ఓటు వేయడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243k, 243ZA ప్రకారం స్వతంత్ర, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించడం రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత అని తెలిపారు. అలాగే ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 326 (ఓటు హక్కు) ఉల్లంఘనకు ఈ అక్రమాలు దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల పారదర్శకత కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలో ఫింగర్‌ప్రింట్ లేదా ఐరిస్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ వ్యవస్థను ప్రవేశపెట్టాలని, ఓటరు గుర్తింపు ప్రక్రియను ఆధునిక సాంకేతికతతో బలోపేతం చేయాలని సూచించారు.
అదేవిధంగా ఒక వ్యక్తి ఒకే ఓటు వేయగలిగేలా సాంకేతిక నియంత్రణలు, బోగస్ ఓటింగ్ నివారణకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ, సిసిటివి,డిజిటల్ మానిటరింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ అంశంపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర నివేదిక ఆధారంగా తగిన విధాన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.