బీహార్ రాష్ట్రంలోని సుపాల్ జిల్లా త్రివేణిగంజ్ పరిధిలో ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. గురువారం మధ్యాహ్న భోజనం అనంతరం 100కి పైగా విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.
పాఠశాలలో వడ్డించిన ఆలూ-శనగల కూరలో చనిపోయిన తేలు ఉన్నట్లు విద్యార్థులు గుర్తించినట్టు సమాచారం. అయితే అప్పటికే చాలామంది విద్యార్థులు ఆ భోజనం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపటికే వారికి గొంతు మంట, కడుపునొప్పి, వాంతులు, తలతిరగడం వంటి సమస్యలు ప్రారంభమయ్యాయి.
ఈ పరిణామంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది, స్థానికులు వెంటనే విద్యార్థులను సమీప ఆసుపత్రులకు తరలించారు. వైద్యులు తక్షణ చికిత్స అందించడంతో ప్రస్తుతం వారి ఆరోగ్యం స్థిరంగా ఉందని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై జిల్లా అధికారులు తీవ్రంగా స్పందించారు. భోజనంలో నాణ్యత లోపం, నిర్లక్ష్యం వంటి అంశాలపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. తప్పిదం నిర్ధారణైతే సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
also read: హనీమూన్ హత్య కేసు: సోనమ్‌కు బెయిల్ రద్దు, 3 వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం