క్రైం మిర్రర్ : పాఠశాల తనిఖీకి వెళ్లిన జిల్లా కలెక్టర్ హరిత తన ప్రత్యేక శైలితో ఆకట్టుకున్నారు. అధికార హోదాను పక్కన పెట్టి విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని వారితో మమేకమయ్యారు. అనంతరం స్వయంగా పాఠాలు బోధిస్తూ విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని పరిశీలించారు. పాఠశాల తనిఖీలో భాగంగా కలెక్టర్ తరగతి గదులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి చదువు తీరు, పాఠాల అవగాహన, అభ్యాస సామర్థ్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వయంగా కొన్ని ప్రశ్నలు అడిగి విద్యార్థుల ప్రతిభను పరీక్షించారు. సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులను అభినందించి, చాక్లెట్లు అందిస్తూ వారిలో మరింత ఉత్సాహాన్ని పెంచారు.
ఈ సందర్భంగా ఓ విద్యార్థినిని తొమ్మిదో ఎక్కం చెప్పాలని కలెక్టర్ అడగగా, ఆమె ఎలాంటి తడబాటు లేకుండా గడగడా చెప్పడంతో కలెక్టర్ ప్రశంసించారు. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే ప్రాథమిక విద్యా నైపుణ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అనంతరం కలెక్టర్ పాఠశాల పరిసరాలను పరిశీలించి పరిశుభ్రతపై అధికారులకు సూచనలు చేశారు. తరగతి గదుల నిర్వహణ, విద్యా బోధన విధానం, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. తాగునీటి వసతి, మౌలిక సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు.
పాఠశాల వంటశాలను కూడా పరిశీలించిన కలెక్టర్.. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, శుభ్రమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిత మాట్లాడుతూ, పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్ స్వయంగా విద్యార్థులతో మాట్లాడి పాఠాలు బోధించడం పట్ల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
also read : విద్యార్థుల పోరాటానికి కేటీఆర్ మద్దతు.. పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండనున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్